పంట మార్పిడితోనే రైతుకు అధిక లాభం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
పంట మార్పిడితోనే రైతుకు అధిక లాభం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం, ఆంధ్రప్రభ:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని మైలారం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఆదాయం ఎక్కువగా వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా దిగుబడులు, ఆదాయం పెరుగుతాయని చెప్పారు. రైతులకు ఈ అంశంపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇటీవల విద్యుత్ ప్రమాదాల కారణంగా 60 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, నలుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. గ్రామసభల్లో విద్యుత్ సమస్యలను తెలియజేస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువుల మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు.
పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని పోషకాలు నశించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని, రైతులు అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.
విద్యారంగంపై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత బస్సు, అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
భూ భారతి కార్యక్రమం ద్వారా అర్హులైన రైతులకు భూమి పట్టాలు అందజేస్తామని చెప్పారు. జిల్లాలో 8 వేల ఎకరాల్లో భూ సర్వే కొనసాగుతోందని, సర్వే పూర్తయ్యాక పట్టాల పంపిణీ చేపడతామని వెల్లడించారు.
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.200 కోట్లతో 40 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, 60 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలు పరిశ్రమలు, గోదాముల నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రూ.50 కోట్లతో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మిస్తున్నామని చెప్పారు.
అలాగే రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, చెల్పూర్ నుంచి గూడేప్పాడు వరకు నాలుగు వరుసల రహదారి అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. గణపురం రిజర్వాయర్ పంట కాలువల మరమ్మతులకు రూ.32 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 12 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని, గ్రామాలు, మున్సిపాలిటీల్లో వార్డు, గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
