దిగుబడి–పశుగ్రాసానికి ప్రాధాన్యత..
- ఎల్ నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి
- కదిరి టీఆర్‌ఎస్‌లో రాయలసీమ స్థాయి సమీక్ష సమావేశం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఎల్ నినో ప్రభావంతో రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాలను మార్చుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే, తక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, పరిస్థితులు మరింత ప్రతికూలంగా ఉంటే పశుగ్రాస ఉత్పత్తికి కూడా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ మేరకు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం (టీఆర్‌ఎస్)లో రాయలసీమ నాలుగు జిల్లాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ డి. సంపత్ కుమార్, నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి, కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.వి. భాస్కర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, నాలుగు జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రాయలసీమలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని, దీంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఎక్కువ నీటి అవసరం ఉండే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా రైతులకు తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాయలసీమలో వేరుశనగ సాగు పూర్తిస్థాయిలో అనుకూలంగా లేదని, అందువల్ల ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
పంట దిగుబడి సాధ్యంకాని పరిస్థితుల్లో కనీసం పశుగ్రాస ఉత్పత్తి జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. రైతులకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై మార్గదర్శకాలు అందించడం, అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు పంపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. రాయలసీమలో మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, అనుబంధ సంస్థలు సమన్వయంతో పనిచేసి రైతులకు నష్టాలు తగ్గించే చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
