మనపాడు వద్ద బస్సు–లారీ ఢీ.. 10 మందికి గాయాలు
హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కర్నూలు ఆస్పత్రికి తరలింపు
మనపాడు, (ఆంధ్రప్రభ): జాతీయ రహదారి-44పై మనపాడు స్టేజ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. హిందూపురం నుంచి 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రి 2 గంటల సమయంలో అనంతపురం నుంచి జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాద సమాచారం అందుకున్న గద్వాల జిల్లా 108 ఎగ్జిక్యూటివ్ మేనేజర్ రత్నం ఆధ్వర్యంలో మనపాడు, ఉండవెల్లి, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి 108 అంబులెన్సులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బస్సులోని 22 మంది ప్రయాణికుల్లో పది మందికి గాయాలు కాగా, స్వల్ప గాయాలైన వారికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
