యువత పొగాకు మాయాజాలానికి దూరంగా ఉండాలి..
యువత పొగాకు మాయాజాలానికి దూరంగా ఉండాలి..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ భవిష్యత్తైన యువత పొగాకు కంపెనీలు చేస్తున్న ప్రచార మాయాజాలానికి లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (మే 31)ను పురస్కరించుకుని మంగళవారం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతం పొగాకు వినియోగం కేవలం సిగరెట్లకే పరిమితం కాలేదని, గుట్కా, పాన్ మసాలా, హుక్కా, నషమ్ వంటి రూపాల్లో యువత వ్యసనాలకు లోనవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి క్యాన్సర్‌తో పాటు గుండెపోటు, పక్షవాతం, శ్వాసకోశ సమస్యలు, వంధ్యత్వం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని హెచ్చరించారు.
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్.కే. ప్రకాష్ మాట్లాడుతూ క్యాన్సర్‌పై ప్రజల్లో సరైన అవగాహన అవసరమని అన్నారు. పొగాకు వినియోగం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాకుండా నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.
వైస్ ప్రిన్సిపల్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సింధియా శుభప్రద మాట్లాడుతూ యువత దేశ నిర్మాణంలో కీలక శక్తిగా ఉండాలని, పొగాకు వ్యసనాలకు బానిస కావడం సమాజానికి ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. వ్యసనాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం డి-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసిందని, అవసరమైన వారు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి నాయక్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ రూఫస్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుమన్, లెక్చరర్ సురేష్, ఎన్టీసీపీ సైకాలజిస్టులు, పీజీ వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
వైద్యులు పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకర జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు.
