Yoga Month | ఆంధ్రప్రదేశ్‌లో మెగా యోగా! నేటి నుంచి యోగాంధ్ర ప్రచారానికి శ్రీకారం


నెల రోజుల పాటు యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు
30 రోజుల్లో రెండు కోట్ల మందిని భాగ‌స్వామ్యం చేస్తాం
జూన్ 21న ప్ర‌ధాని మోదీ స‌మ‌క్షంలో మెగా ఈవెంట్
అయిదు లక్ష‌ల మంది పాల్గొనే అవ‌కాశం
యోగాతో మాన‌సిక బ‌లం, ఆరోగ్యం స్థిరంగా ఉంటాయి
అంద‌రి జీవితాల్లో యోగా ఒక భాగం కావాలి
రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు

వెలగపూడి, ఆంధ్రప్రభ :
11వ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగా మన వారసత్వమని.. యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాని మోదీ కారణమన్నారు. మెరుగైన జీవనానికి యోగా దోహద పడుతుందన్నారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అన్నారు. యోగా అనేది కొద్దిమందికో లేక.. కొన్ని ప్రాంతాలకో సంబంధించింది కాదని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

అంద‌రి జీవితాల్లో యోగా భాగం కావాలి..

అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అన్నారు. ఫొటోలు, ఈవెంట్‌ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష , పట్టుదలతో చేస్తున్నారన్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర-2025పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21 తేదీన యోగా డే నిర్వహిస్తామని.. ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో యోగ డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు.

కుప్పంలో చంద్ర‌బాబు.. గంగ‌మ్మ‌కు ప‌ట్టు వ‌స్త్రాలు..

ముఖ్య‌మంత్రి సొంత నియోజ‌వ‌ర్గం కుప్పంలో జ‌రుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్ర‌బాబు స‌తీస‌మేతంగా పాల్గొన్నారు.. మంగ‌ళ‌గిరి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కుప్పం చేరుకున్నారు. నేరుగా గంగ‌మ్మ త‌ల్లి ఆల‌యానికి వెళ్లి అమ్మ‌వారికి ప‌ట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు.. అనంత‌రం గంగ‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.. .

Leave a Reply