డ్రగ్స్‌పై దండయాత్ర.. “మత్తు మహమ్మారిని తరిమికొట్టాలి”

డ్రగ్స్‌పై దండయాత్ర.. “మత్తు మహమ్మారిని తరిమికొట్టాలి”
యువత గంజాయికి దూరంగా ఉండాలి: రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ
కంచికచర్ల, మే 23 (ఆంధ్రప్రభ):
సమాజం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కదిలిరావాలని, గంజాయి తదితర మత్తు పదార్థాలకు యువత, గ్రామస్తులు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ సూచించారు.
కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో శనివారం రాత్రి రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ, నందిగామ పోలీస్ సబ్‌డివిజన్ ఏసీపీ సీహెచ్. శ్రీనివాసరావు, నందిగామ రూరల్ సీఐ వైవీవీఎల్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రూరల్ డీసీపీ మాట్లాడుతూ.. గంజాయి తదితర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న “డ్రగ్స్‌పై దండయాత్ర 2.0” కార్యక్రమంలో భాగంగా గంజాయి సేవిస్తున్న వారిని డ్రగ్ టెస్ట్‌ల ద్వారా గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే పోక్సో చట్టం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చెవిటికల్లు గ్రామాన్ని “డ్రగ్స్ రహిత గ్రామం”గా గుర్తించినట్లు రూరల్ డీసీపీ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కంచికచర్ల ఎస్సై పి. విశ్వనాథ్, పోలీస్ సిబ్బంది, చెవిటికల్లు గ్రామస్తులు పాల్గొన్నారు
