tirumala| ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
tirumala| ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
టీటీడీ కీలక ప్రకటన
జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉత్సవాలు, పర్వదినాల నేపథ్యంలో నిర్ణయం
బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజుల్లో వీఐపీ దర్శనాలకు విరామం
ముందురోజు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబోమన్న టీటీడీ
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు జరిగే పలు పర్వదినాలు, వార్షిక ఉత్సవాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు భక్తులు తమ తిరుమల యాత్రను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు కొన్ని తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. అలాగే ఆగస్టు 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ సందర్భంగా కూడా వీఐపీ దర్శనాలను నిలిపివేయనున్నారు.
సెప్టెంబర్ 8న బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాల అంకురార్పణ, అలాగే సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, పై తేదీలకు ముందురోజు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ ప్రకటించింది. దీంతో వీఐపీ దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని ముందుగానే గమనించాలని సూచించింది.
టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తూ, ఉత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, దర్శనం, వసతి, ప్రయాణ ఏర్పాట్లను ముందుగానే ప్రణాళిక చేసుకుని యాత్రకు రావాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
