గుంతలమయమైన రహదారితో ప్రజలకు నరకయాతన
టేకుమట్ల, (ఆంధ్రప్రభ): భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి మరింత దెబ్బతిని పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు అంచనా వేయలేక ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ ఈ రహదారిపై ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని కోరారు.
శ్రావణ్ (వాహనదారుడు) మాట్లాడుతూ.. మందమర్రి నుంచి వెంకట్రావుపల్లికి రాత్రి సమయంలో ఈ రహదారిపై ప్రయాణించడం ప్రాణాపాయంగా మారిందన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చాలని విజ్ఞప్తి చేశారు.
