Stock Market Updates | 1,700 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Stock Market Updates | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపట్టడంతో కీలక సూచీలు కుప్పకూలాయి.

మధ్యాహ్నం 2:16 గంటల సమయానికి సెన్సెక్స్ 1,700 పాయింట్లకు పైగా కోల్పోయి 76,577 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 486 పాయింట్లు పతనమై 23,917 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపిస్తోంది.

పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలోనూ ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. ఇదే ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై కూడా పడడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. పరిస్థితులు చక్కబడే వరకు మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగొచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.