ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు..

ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు..

ఇక నిర్లక్ష్యానికి తావులేదా?

శ్రీశైలం, ఆంధ్రప్రభ ఓటర్ల జాబితా ఎన్నికల ప్రక్రియకు పునాదిగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తూ అనర్హులు జాబితాలో చోటు చేసుకోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026)ను అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్ సూచించారు.

శనివారం శ్రీశైలంలో నంద్యాల, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్-2026 అమలుకు సంబంధించిన సంసిద్ధత, కార్యాచరణ, ఫీల్డ్ స్థాయి విధివిధానాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ శీష్‌రామ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ దూబే మాట్లాడుతూ, ఎన్నికల జాబితా శుద్ధీకరణ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేసి డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-21 ప్రకారం ఎన్నికల సంఘానికి ప్రత్యేక సంక్షిప్త సవరణ నిర్వహించే అధికారం ఉందన్నారు. ఓటరుగా నమోదు కావాలంటే భారతీయ పౌరుడై ఉండటంతో పాటు 18 సంవత్సరాల వయస్సు పూర్తై ఉండాలని, సాధారణ నివాసిగా ఉండాలని, చట్టపరమైన అనర్హతలు లేకుండా ఉండాలని స్పష్టం చేశారు.

ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణించబడుతుందని, దానిని చిరునామా లేదా పుట్టిన తేదీ రుజువుగా స్వీకరించరాదని పేర్కొన్నారు.

త్వరలో ప్రారంభమయ్యే ఎన్యూమరేషన్ ప్రక్రియలో బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఫారాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను కనీసం మూడుసార్లు సందర్శించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు, ఫొటోలు, అనుబంధ పత్రాల సేకరణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లైవ్ ఫొటోలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

ఓటర్ల జాబితాలోని అసంగతతలను గుర్తించి సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డెమోగ్రాఫిక్ సిమిలారిటీ ఎంట్రీలు, బహుళ నమోదులు, తప్పు వివరాల నమోదును క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్‌ఓ యాప్, ఈఆర్‌ఓ లాగిన్‌లలో కనిపించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా తయారీలో రేషనలైజేషన్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంలో న్యాయబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తుల ఆమోదం లేదా తిరస్కరణ సమయంలో సరైన కారణాలు నమోదు చేయాలని సూచించారు. ప్రతి నిర్ణయం ఎన్నికల సంఘానికి సమర్పించే డిజిటల్ అఫిడవిట్‌తో సమానమని గుర్తుంచుకోవాలని అన్నారు.

అర్హుడైన ఓటరు అనవసరంగా జాబితా వెలుపల ఉండకుండా, అనర్హుడు చొరబడకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో తరచూ సమావేశాలు నిర్వహించి ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఏఎస్‌డీ (Absent, Shifted, Dead) జాబితాలను క్రమం తప్పకుండా పంచుకోవాలని చెప్పారు.

భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందన్నారు. ఇప్పటివరకు దాదాపు 60 శాతం ఓటర్ల కవరేజీ పూర్తైందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల జాబితాల నాణ్యత మెరుగుపడటంతో పాటు ఓటర్ల భాగస్వామ్యం కూడా పెరిగిందన్నారు.

ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సందేహాల నివృత్తికి ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను చివరి రోజులకు వాయిదా వేయకుండా ప్రారంభ దశ నుంచే వేగవంతంగా చేపట్టాలని, అవసరమైతే రాజకీయ అనుబంధాలు లేని వాలంటీర్ల సహకారాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ, శ్రీశైలం భూమిపై ఉన్న కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రమని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి బూత్ స్థాయి అధికారి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఓలు, బూత్ స్థాయి ఏజెంట్లు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.

సమావేశంలో సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు పాల్గొన్నారు.