శ్రీశైలంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం…
శ్రీశైలంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం…
యోగ సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యం..
ప్రతిరోజూ యోగా జీవితంలో భాగం చేసుకోవాలి..
జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారతదేశం ప్రపంచానికి యోగా అనే అమూల్యమైన వరాన్ని అందించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీశైలంలో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని క్రమం తప్పకుండా ఆచరించాలని సూచించారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే యోగాంధ్ర కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలంలో నిర్వహించిన ఈ ప్రత్యేక యోగా కార్యక్రమంలో సుమారు 2,100 మంది పాల్గొని యోగాభ్యాసం చేశారు. కార్యక్రమం కోసం ఆలయ ముఖద్వారం సమీపంలోని గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయగా, గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు.

జిల్లా యంత్రాంగం, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల సూచనల మేరకు దేవస్థానం పరిధిలో యోగా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం కోసం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యోగా గురువులను ఆహ్వానించామని, గత రెండు రోజులుగా సిబ్బంది, స్థానికులు, యాత్రికులకు ప్రత్యేక యోగా శిక్షణ అందించామని చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. యోగ సాధన వల్ల శారీరక, మానసిక సామర్థ్యాలు పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.
అనంతరం ప్రముఖ యోగా గురువు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం సాధకులతో సూక్ష్మ వ్యాయామాలు చేయించి, ప్రణవ ధ్యానం, ప్రాణాయామం నిర్వహించారు. ప్రాణాయామం ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ యోగాసనాలను అభ్యసింపజేశారు. యోగాభ్యాస సమయంలో ప్రతి ఆసనానికి సంబంధించిన ప్రయోజనాలను ఆధునిక వైద్య విజ్ఞానంతో అనుసంధానం చేస్తూ వివరించారు. త్రికోణాసనం, ఉత్థాన పాదాసనం, అర్ధ హలాసనం, శలభాసనం వంటి ఆసనాలతో పాటు కపాలభాతి, అనులోమ-విలోమ, శీతలి, భ్రామరి తదితర ప్రాణాయామ విధానాలను నిర్వహించారు. శారీరక ఆసనాలు, శ్వాస నియంత్రణ, ధ్యానం, ప్రాణాయామం యోగాలోని ప్రధాన అంశాలని తెలిపారు.
చివరగా శాంతి మంత్రాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్‌డీఓ వెంకటశివ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు, జిల్లా నోడల్ అధికారి డా. వాణి, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు జి. గంగమ్మ, దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన డా. దీవి హయగ్రీవాచార్యులు వ్యాఖ్యాతగా వ్యవహరించి యోగా విశిష్టత, యోగ సాధన ద్వారా కలిగే ఆధ్యాత్మిక అనుభూతులను విశదీకరించారు.
