కొనుగోలు చేసేందుకు తగ్గిన ఆసక్తి

కొనుగోలు చేసేందుకు తగ్గిన ఆసక్తి

  • సామాన్యుడికి అందనంత దూరంలో ధరలు
  • అప్పుల పాలవుతున్న రియల్ వ్యాపారులు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : ఒకప్పుడు రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు గా వికసించింది. కాని గత రెండేండ్లుగా రియల్ వ్యాపారం రివర్స్ గేర్ లో పయనిస్తోంది. ఎనిమిది ఏండ్ల కింద గజం ధర సుమారు 10 వేయిలు పలికితే ప్రస్తుతం అప్పటి ధరకు కూడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర మంధ్యం ఎదుర్కొంటోంది. ఇండ్లు, ఇంటి స్థలాలు ఒకప్పుడు డిమాండ్ గా అమ్మకాలు ఉండేవి. కాని ప్రస్తుతం వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపకపోవడం తో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ గేర్ లో పయనిస్తోంది. ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్, ఇండ్ల ధరలు పేద, మధ్యతరగతి వారికి అందనంత పైకి వెళ్లడం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడ రియల్ రంగం వెనుకబాటుకు కారణం అవుతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

భారిగా తగ్గిన అమ్మకాలు

రియల్ రంగం ఒక్కసారి కుప్పకూలీ పోవడం తో అమ్మకాలు భారిగా తగ్గుముఖం పట్టాయి. ఇంటి స్థలాలు, కమర్షియల్ స్థలాలు, ఇండ్లు కొనుగోలు చేసే వారు లేక వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకు పోతున్నారు. ఓపెన్ ప్లాట్స్, నాన్ లే అవుట్ ప్లాట్స్, వెంచర్ల పై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో రియల్ వ్యాపారులు తిరోగమనం లోకి వెళుతున్నారు.

ప్రభుత్వ విధానాలు.. యుద్ధ ప్రభావం

కొన్ని సంవత్సరాలు ఒక వెలుగు వెలిగిన రియల్ వ్యాపారం మారుతున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా రియల్ ఎస్టేట్ నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ విధానాలకు తోడుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఉద్రిక్త పరిస్థితులు రియల్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితి గత రెండేండ్లుగా ఇంకా తీవ్ర రూపం దాలుస్తోంది.

భవిష్యత్తు అగమ్య గోచరం

పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, భవిష్యత్తు అవసరాల కొరకు కొనుగోలు చేసి పెట్టుకున్న ప్లాట్స్ నేడు తిరోగమానం కావడం, కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడం, ఎవరైనా కోనేందుకు ముందుకు వచ్చినా పెట్టుబడి కూడ రాకపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల కారణంగా పేద, మధ్యతరగతి వర్గాల బాధలు వర్ణనాతీతం అనొచ్చు. కొనుగోలు చేసిన దానికంటే కూడ సగం రేట్ కూడ రావడం లేదని కొందరు వాపోతున్నారు. కనీస పెట్టుబడి వచ్చినా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నుండి గట్టేక్కుతామనే పరిస్థితి ఉంటోంది. కొనుగోలుదారులు ముందుకు రాక పెట్టుబడి అందక కొన్ని కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లక్షలు గుమ్మరించి… అప్పుల పాలై

రియల్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలని కలలు కన్నా కొందరు వ్యాపారులకు అదే వ్యాపారం శాపం అయ్యింది. కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వీరికి రియల్ వ్యాపారం రివర్స్ కావడంతో వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తెచ్చి పెట్టిన అప్పులకు వడ్డీ కట్టలేక, పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు కాసులు కురిపించిన రియల్ వ్యాపారం నేడు కాసులు ఏరుకునే దుస్థితి తెచ్చి పెట్టిందని రియల్ వ్యాపారులు బాధపడు తున్నారు.