విజ్జీ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ కు సహకరించండి..

విజ్జీ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ కు సహకరించండి..
జీఎంఆర్ చైర్మన్‌తో ఎమ్మెల్యే అదితి, శాప్ చైర్మన్ భేటీ..
ఉత్తరాంధ్రను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు..
పీ పీ పీ విధానంలో ఆధునిక శిక్షణా కేంద్రం ఏర్పాటు..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో పర్యటనలో భాగంగా జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు ను విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు, శాప్ చైర్మన్ రవి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరంలోని విజ్జీ స్టేడియం వద్ద స్పోర్ట్స్ స్కూల్ స్థాపనపై విస్తృతంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువ క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణ, ఆధునిక క్రీడా మౌలిక వసతులు, నిపుణుల కోచింగ్ అందించడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు శాప్ చైర్మన్ రవి నాయుడు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఈ ప్రాజెక్టును అమలు చేసి, ఉత్తరాంధ్రను ప్రముఖ స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని ప్రతిపాదించారు. విజ్జీ స్టేడియం వద్ద స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని జీఎంఆర్ చైర్మన్‌ను కోరగా, ఆయన ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
