వత్సవాయి ఎంజేపీని జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తా..

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పీ 4 విధానంతో వత్సవాయి ఎంజేపీ అభివృద్ధి అభినందనీయం
ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల దంపతులు దాతృత్వం ఎందరికో స్ఫూర్తి
బీసీ విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
రాష్ట్రంలో కొత్తగా 10 గురుకులాల ఏర్పాటు
10 శాతం మేర డైట్ ఛార్జీల పెంపు : మంత్రి సవిత
పీ 4 విధానంలో వత్సవాయి గురుకులంలో డార్మెటరీ, డైనింగ్ హాల్ ను ప్రారంభించిన మంత్రి సవిత

వత్సవాయి, ఆంధ్రప్రభ : పీ 4 విధానం చాలా గొప్పదని, ఈ విధానంతో పేదరికం దూరం చేయొచ్చునని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సంపన్న వర్గాలు వారు తమ స్వస్థలాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పీ 4 విధానంలో వత్సవాయి ఎంజేపీ స్కూల్ ను అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల రాంబాబు ఎందరో దాతలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వత్సవాయి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో పీ-4 విధానంలో ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల రాంబాబు సాయంతో రూ.75 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మెటరీ ప్రారంభించిన మంత్రి సవిత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆశయాన్ని కొనసాగిస్తూ… పీ 4 విధానంలో రూ.75 లక్షలతో వత్సవాయి ఎంజేపీ స్కూల్ ను అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల రాంబాబు దంపతులను అభినందించారు. ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల రాంబాబు ఎంతో మంది దాతలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. సంపన్నవర్గాల్లోని దాతలు ముందుకొచ్చి, తమ గ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ లో ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని, తమ కూటమి ప్రభుత్వానికి ఫొటోలు, ప్రచారం పిచ్చిలేదన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో తో విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా టెన్త్, ఇంటర్ లో గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది అత్యున్నతమైన ఫలితాలు వచ్చాయన్నారు.

…కొత్తగా 10 బీసీ గురుకులాల ఏర్పాటు…

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలలను స్థాపించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వందల సంఖ్యలో గురుకులాలు స్థాపించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామన్నారు. ఆరు ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కొత్తగా బీసీ హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఆర్వో పాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తరగతి గదులు, విశ్రాంతి గదుల్లో దోమలు రాకుండా దోమ తెరలు అమర్చామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. డైట్ ఛార్జీల బిల్లులు 10 శాతం పెంచబోతున్నామని మంత్రి సవిత తెలిపారు.

…అప్ గ్రేడ్ కు కృషి చేస్తా….

వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలకు మరికొంత స్థలం కేటాయిస్తే ప్రభుత్వం తరఫున శాశ్వత భవనం కూడా సమకూర్చుతామని తెలిపారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల కళాశాలను రూ.కోటితో అభివృద్ధి చేసిన చిరుమామిళ్ల రాంబాబు, విజయలక్ష్మి దంపతుల సేవా నిరతిని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరుమామిళ్ల కుమార్తెను రాధను మంత్రి సవిత సత్కరించారు. ఎంజేపీ గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన స్పోర్ట్స్ ట్రాక్ షూట్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవిత మధ్యాహ్న భోజనం చేశారు. అంతకుముందు ఎంజేపీ గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్, డార్మెటరీ రూమ్ లను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో తరగతి గదులను, విశ్రాంతి గదులను, వంట గదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురామ్, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.