Visakha | ఆర్కే బీచ్ లో ఆంక్ష‌లు.. ఈ నెల 21 వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు నో ఎంట్రీ

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి వేదిక‌గా బీచ్
హాజ‌రుకానున్న‌ ప్ర‌ధాని మోదీ , చంద్ర‌బాబు, ప‌వ‌న్

విశాఖ‌ప‌ట్నం – అంతర్జాతీయ యోగా వేడుక‌లు జ‌రిగే విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం. నేటి నుంచి 96 గంటల పాటు ఈ బీచ్ లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

రానున్న ప్ర‌ధాని ..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు రానున్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వంటి ప్రముఖులు అంతర్జాతీయ యోగాడేలో పాల్గొనున్నారు. యోగాంధ్ర 2025 కోసం ప్రధాన వేదికగా ఆర్కే బీచ్‌ను ఎంపిక చేశారు. లక్షల మంది వేడుకల్లో పాల్గొననున్నారు. యోగా దినోత్సవం రోజు ఉదయం 5:30 గంటల నుంచి ప్రజలకు వేదిక వద్దకు అనుమతి ఉంటుంది. ప్రధాని మోడీ ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని ప్రసంగం అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.

భారీగా ఏర్పాట్లు ..
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మందిపాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ప్రధాన మంత్రి సమక్షంలో విశాఖ యోగా డే డిక్లరేషన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా యోగాను నిరంతర ప్రక్రియగా ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Leave a Reply