తైవాన్‌ను వణికించిన భారీ భూకంపం…

  • వణికిన రాజధాని తైపీ
  • మూడు రోజుల్లో రెండోసారి
  • యిలాన్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా

ఆంధ్రప్రభ : తైవాన్ ఈశాన్య తీరంలో శనివారం రాత్రి సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు రాజధాని తైపీ సహా పలు ప్రధాన నగరాలను వణికించాయి. రాత్రి సరిగ్గా 11:05 గంటల సమయంలో యిలాన్ నగరానికి 32.3 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ ఏజెన్సీ (CWA) వెల్లడించింది.

భూమికి దాదాపు 73 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో, తైపీలోని ఎత్తైన భవనాలు ఊగిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు అర్ధరాత్రి వేళ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, తైవాన్‌లో గత మూడు రోజుల్లో భూమి కంపించడం ఇది రెండోసారి కావడం విశేషం. సరిగ్గా మూడు రోజుల క్రితమే తైతుంగ్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఇప్పుడు అంతకంటే బలమైన ప్రకంపనలు రావడం గమనార్హం.

భూకంపం వల్ల యిలాన్ నగరంలో సుమారు 3,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం ఎక్కడా భారీ ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

సునామీ ముప్పు లేదు.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు

భూకంపం సంభవించడంతో సునామీ వచ్చే ప్ర‌మాదం ఉందన్న భయం అందరినీ వెంటాడింది. అయితే, తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ ఈ విషయంలో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. సునామీ ముప్పు ఏమీ లేదని స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

కాకపోతే, రాబోయే 24 గంటల్లో రిక్టర్ స్కేలుపై 5.5 నుంచి 6.0 తీవ్రతతో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply