7thMaychintana | దైవాన్వేషణకు జిజ్ఞాసే పునాది
7thMaychintana | దైవాన్వేషణకు జిజ్ఞాసే పునాది
7thMaychintana | అహంకారం, మాయే ప్రధాన అడ్డంకులు
కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాల ప్రాధాన్యం
దైవత్వం అంటే ప్రేమ, శాంతి, కరుణ
అంతర్ముఖతతోనే ఆత్మసాక్షాత్కారం
7thMaychintana | మానవ చరిత్రలో అత్యంత లోతైన ప్రక్రియ దైవాన్వేషణ. మనిషి తన ఉనికికి మూలాన్ని, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి చేసే ఒక నిరంతర ప్రయాణం. చాలామంది దైవం ఎక్కడో ఆకాశంలోనో, దేవాలయాల్లోనో, పర్వత గుహల్లోనో ఉన్నాడని భావిస్తారు. కానీ నిజమైన అన్వేషణ జిజ్ఞాసతో మొదలవుతుంది. “నేనెవరు? ఈ సృష్టి వెనుక ఉన్న శక్తి ఏమిటి?” అనే ప్రశ్నలు ఉదయించినప్పుడు దైవాన్వేషణకు పునాది పడుతుంది. విగ్రహారాధన, తీర్థయాత్రలు, పూజలు, గ్రంథ పఠనం ఇవి ప్రాథమిక దశలో క్రమశిక్షణను, భక్తిని పెంచడానికి తోడ్పడతాయి. బాహ్య ప్రపంచం నుండి దృష్టిని మళ్లించి, తనలోపలికి తాను ప్రయాణించడం. ఉపనిషత్తులు చెప్పినట్లుగా “తత్వమసి” (అది నీవే) అని గుర్తించడమే అన్వేషణ అంతిమ లక్ష్యం.
దైవాన్వేషణలో ప్రధాన అడ్డంకులు మనలోని అహంకారం, మాయ. ప్రపంచం ఇచ్చే తాత్కాలిక సుఖాల పట్ల ఆకర్షణ మనల్ని నిరంతర సత్యం వైపు చూడనివ్వదు. మనసులోని అలజడి తగ్గినప్పుడే, నిశ్చలమైన నీటిలో ప్రతిబింబం కనిపించినట్లుగా, దైవత్వం సాక్షాత్కరిస్తుంది. అలాగే కోరికలు, ద్వేషం, అసూయ వంటి మాలిన్యాలు అద్దంపై దుమ్ములా కప్పి ఉంచి మనలోని దైవాన్ని మనకు కనిపించకుండా చేస్తాయి. దైవాన్వేషణ అంతిమ లక్ష్యం దైవాన్ని చూడటం కాదు, దైవత్వంలో లీనం కావడం. అంటే ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను చూడగలగడం, అందరిపట్ల కరుణను కలిగి ఉండడం.
భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం దైవాన్వేషణ అనేది కేవలం ఒక నమ్మకం కాదు; అది మనిషి తన పరిమితులను అధిగమించి అనంతమైన సత్యంలో కలవడానికి చేసే ప్రయాణం. ఈ లక్ష్య సాధన కోసం మన మహర్షులు మనిషి మనస్తత్వాన్ని బట్టి నాలుగు ప్రధాన మార్గాలను (యోగాలను) బోధించారు. అవే కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగ మార్గాలు.
దైవాన్ని ప్రేమించడం ద్వారా శరణాగతి పొందడం భక్తి మార్గం. మీరాబాయి, రామదాసు వంటి మహాభక్తులు దీనికి ఉదాహరణలు. వివేచనతో సత్యాసత్యాలను గ్రహించడం జ్ఞానయోగం. ప్రతిఫలాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించడం కర్మయోగం. కర్మయోగం అంటే చేసే పనిని దైవకార్యంగా భావించడం. లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక పని చేయక తప్పదు. అయితే, ఆ పనిని ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు అది బంధం కాకుండా యోగంగా మారుతుంది. ధ్యానం ద్వారా చిత్తవృత్తులను నిరోధించి ఆత్మసాక్షాత్కారం పొందడం రాజయోగం.
స్వామి వివేకానంద వంటి మహానుభావులు ఈ నాలుగు మార్గాల సమతుల్యతను సూచించారు. ఒక వ్యక్తిలో ఈ నాలుగు మార్గాలు కలిసి ఉన్నప్పుడే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. ఈ నాలుగు మార్గాలు విడివిడిగా కనిపించినప్పటికీ, ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
కర్మయోగం హృదయాన్ని శుద్ధి చేస్తే, భక్తియోగం ఏకాగ్రతను ఇస్తుంది. జ్ఞానయోగం సత్యాన్ని చూపిస్తే, రాజయోగం సత్యంలో నిలిచిపోయేలా చేస్తుంది. రాజయోగం అంటే మానసిక శక్తులను క్రమశిక్షణలో ఉంచి, సమాధి స్థితిని పొందడం. దీనిని “అష్టాంగ యోగం” అని కూడా అంటారు. బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తే మనసును లోపలికి మళ్లించడమే ఇందులో ప్రధాన ప్రక్రియ.

దైవం అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక స్థితి. ప్రేమ, కరుణ, శాంతి ఎక్కడ ఉంటాయో అక్కడ దైవత్వం ఉంటుంది. దైవాన్వేషణ అంటే మనలోని అశుద్ధతను తొలగించుకుని, నిర్మలమైన చైతన్యంగా మారడమే. దైవాన్వేషణ అంటే ఎక్కడో ఉన్న శక్తిని వెతకడం కాదు; మనలో నిగూఢంగా ఉన్న చైతన్యాన్ని దర్శించడం.
బాహ్య ప్రపంచంలోని వస్తువుల వల్ల కలిగే ఆనందం తాత్కాలికమని గుర్తించినప్పుడు, శాశ్వతమైన ఆనందం కోసం వెతకడమే దైవాన్వేషణకు పునాది. మనం నిత్యం బాహ్య ప్రపంచాన్ని చూస్తుంటాం. కానీ దైవాన్వేషణ అంతర్ముఖం కావాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.మనసులోని ఆలోచనల రొద తగ్గినప్పుడు మాత్రమే ఆత్మప్రబోధం వినిపిస్తుంది. ఏకాగ్రత ద్వారా మనసును మాయా ప్రపంచం నుండి వేరు చేసి, అంతరాత్మపై కేంద్రీకరించడం అవసరం. దైవం అనేది ఒక వస్తువు కాదు, అది ఒక అనుభూతి. మనసు నిర్మలమైనప్పుడు, హృదయం ప్రేమతో నిండినప్పుడు, అన్వేషణ ముగిసి సాక్షాత్కారం మొదలవుతుంది.
దైవం మనకు దూరంగా లేడు; మనలోని “అహం” అనే పొర వెనుక దాగి ఉన్నాడు. ఆ పొరను తొలగించుకోవడమే నిజమైన దైవాన్వేషణ. బాహ్య ప్రపంచంలోని శబ్దాలు మనల్ని సత్యం వైపు చూడనివ్వవు. రోజులో కొంత సమయం నిశ్శబ్దంగా గడపడం వల్ల మనసులోని అలజడి తగ్గుతుంది. ఆ నిశ్శబ్దంలోనే దైవ వాణి వినిపిస్తుంది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ ఇవే దైవానికి చిరునామాలు.
మన ప్రవర్తనలో వీటిని ప్రతిబింబింపజేయడమే నిజమైన దైవాన్వేషణ. మానవ జన్మకు పరమార్థం దైవత్వాన్ని పొందడం. కానీ ప్రతి మనిషి ఆలోచనా విధానం, ప్రవృత్తి వేర్వేరుగా ఉంటాయి. ఒకరికి సేవ చేయడం ఇష్టమైతే, మరొకరికి ప్రార్థన చేయడం, ఇంకొకరికి తర్కించడం ఇష్టం. అందుకే భారతీయ ఆధ్యాత్మికత అందరికీ ఒకే దారిని రుద్దకుండా, ఎవరికి తగిన మార్గాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చింది.
ఆనంద ‘మైత్రేయ’మ్
8008577834
