ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం..
చీటకోడూరు పరిధిలోని పట్టణ నీటి శుద్ధి కేంద్రం (పంప్ హౌస్), డ్యాంను పరిశీలించిన కలెక్టర్
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి వరంగల్ : జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు సమర్థవంతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం, జనగామ మండలంలోని చీటకోడూరు పరిధిలోని పట్టణ నీటి శుద్ధి కేంద్రం (పంప్ హౌస్), చీటకోడూరు డ్యాంను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ పనితీరు, మోటార్ల సామర్థ్యం, నీటి శుద్ధి ప్రక్రియ, నీటి నిల్వ, పంపిణీ విధానం, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
ట్యాంకు వినియోగంతో తాగునీటి నిల్వ సామర్థ్యం పెరిగి ప్రజలకు నిరంతరాయంగా నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పంప్ హౌస్‌లో పనిచేస్తున్న మోటార్లకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టి, యంత్రాలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా చూడాలన్నారు.
అవసరమైన విడిభాగాలను వెంటనే సమకూర్చి మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పేర్కొన్న కలెక్టర్, నీటి శుద్ధి (ప్యూరిఫికేషన్) ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, క్లోరినేషన్, నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు సరఫరా చేసే ప్రతి చుక్క నీరు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నీటి సరఫరా వ్యవస్థలో లీకేజీలు, పైప్‌లైన్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలను ముందుగానే గుర్తించి, వెంటనే పరిష్కరించాలని, పంపింగ్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పంప్ హౌస్ పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహిస్తూ, భద్రతా ప్రమాణాలను పాటించాలని, నీటి నిల్వ కేంద్రాల వద్ద పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ పరికరాలు, పంపింగ్ యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి, పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, మిషన్ భగీరథ (ఇంట్రా) ఈఈ శ్రీకాంత్, మిషన్ భగీరథ (గ్రిడ్) సూర్య, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

