లోక్‌సభలో నియమం–377 కింద ప్రతిపాదన..
- విజయవాడ ఎంపీ చిన్ని
- విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల టెర్షియరీ కేర్ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి
- ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్రాన్ని కోరిన కేశినేని శివనాథ్
(విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ గుణదాలలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) ఆసుపత్రిని 300 పడకల టెర్షియరీ కేర్ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు అదే ప్రాంగణంలో ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని సోమవారం లోక్‌సభలో నియమం–377 కింద ప్రత్యేక ప్రస్తావనగా వినిపించారు. న్యూఢిల్లీలో లోక్‌సభలో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), 1968లో ప్రారంభమైన విజయవాడ గుణదాల ఈఎస్ఐ ఆసుపత్రి దాదాపు ఆరు దశాబ్దాలుగా పారిశ్రామిక కార్మికులు, ఈఎస్ఐ లబ్ధిదారులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తోందన్నారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో కేవలం 110 పడకలు మాత్రమే ఉండగా, మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలకు చెందిన 2.88 లక్షల మంది బీమాదారులు, దాదాపు 10 లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని వివరించారు. లబ్ధిదారుల సంఖ్య పెరిగినా ఆసుపత్రి సామర్థ్యం పెరగకపోవడంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేక అనేక మంది రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపాల్సి వస్తోందని, దీనివల్ల కార్మిక కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. సామాజిక భద్రతా నియమావళి–2020 అమలుతో ఈఎస్ఐ సేవలపై డిమాండ్ మరింత పెరిగే అవకాశమున్నందున ఇప్పటి నుంచే మౌలిక సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆసుపత్రి ప్రాంగణంలో దాదాపు 25 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండటంతో అదనపు భూసేకరణ అవసరం లేకుండానే విస్తరణ చేపట్టవచ్చని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని 300 పడకల టెర్షియరీ కేర్ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు అదే క్యాంపస్‌లో ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదన అమలైతే దాదాపు 13 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, వైద్య విద్యకు ప్రోత్సాహం లభించి వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎంపీ తెలిపారు. అలాగే మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని, కార్మిక సంక్షేమానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
