అమెరికా రాయబారితో రేవంత్ భేటీ..
- తెలంగాణకు పెట్టుబడులు, విద్యా సహకారంపై చర్చ..
- విద్యార్థుల వీసా స్లాట్లు పెంచాలని విజ్ఞప్తి..
- హెచ్-1బీ ప్రక్రియ సరళీకరణపై వినతి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ-అమెరికా మధ్య విద్య, పెట్టుబడులు, సాంకేతికత, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల విస్తరణతో పాటు విద్యార్థుల వీసా అంశాలపై సమగ్రంగా చర్చించారు. తెలంగాణ నుంచి అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్ వీసా స్లాట్లను పెంచాలని, అలాగే హెచ్-1బీ వీసా ప్రక్రియను మరింత సరళీకరించాలని ముఖ్యమంత్రి రాయబారిని కోరారు.
రాష్ట్రంలో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల అవకాశాలను కూడా రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా సాంకేతికత, పరిశ్రమలు, ఆవిష్కరణలు, విద్యా రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్జియో గోర్ మాట్లాడుతూ, అమెరికాలో.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ఒకటిగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణతో అన్ని రంగాల్లో సంబంధాలను మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందిస్తూ, తెలంగాణ ప్రజలకు అమెరికా రాయబారి ప్రత్యేక మిత్రుడిగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ–అమెరికా సంబంధాల బలోపేతానికి ఆయన అందిస్తున్న సహకారానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
