ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అవినీతి జలగలు

ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అవినీతి జలగలు

ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ:

ఎమ్మిగనూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవహారాలు బట్టబయలయ్యాయి. ఎరువుల దుకాణ లైసెన్స్‌ రెన్యూవల్‌తో పాటు విత్తనాల విక్రయ అనుమతుల కోసం లంచం డిమాండ్‌ చేసిన వ్యవసాయ శాఖ సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని బుధవారం ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి తప్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో “తిమింగళం జారిపోయి… చిరు చేపలు చిక్కాయి” అంటూ పట్టణంలో చర్చ సాగుతోంది.

ఏసీబీ డీఎస్పీ సోమన్న వెల్లడించిన వివరాల మేరకు…

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ ప్రాంతంలో మహాలక్ష్మి ట్రేడర్స్‌ పేరిట ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న ఈడిగ రంగన్న తన షాపు లైసెన్స్‌ రెన్యూవల్‌తో పాటు విత్తనాల విక్రయ అనుమతుల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.35 వేల లంచం ఇవ్వాలని సంబంధిత అధికారులు డిమాండ్‌ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం బుధవారం సాయంత్రం ఎమ్మిగనూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ట్రాప్‌ నిర్వహించారు. ఒప్పందం ప్రకారం బాధితుడు రూ.30 వేల లంచం మొత్తాన్ని ఏఈవో నర్సింహులు, ప్రైవేట్‌ వ్యక్తి మోహన్‌లకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దాడుల సందర్భంగా మోహన్‌ వద్ద అదనంగా రూ.73 వేల అనధికార నగదు కూడా లభ్యమైనట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు, సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఎమ్మిగనూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో లైసెన్స్‌లు, అనుమతుల పేరుతో భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐ రాజా ప్రభాకర్‌, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply