కొరియా మాస్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు షాక్

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కొరియా మాస్టర్స్-2026లో భారత సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఇజ్రాయెల్‌కు చెందిన డానిల్ డుబోవెంకో చేతిలో 20-22, 14-21, 12-21 తేడాతో ఓడి టోర్నీకి వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన జోరును కొనసాగించలేకపోయిన శ్రీకాంత్‌కు ఇది నిరాశ కలిగించే ఫలితంగా నిలిచింది.

అయితే భారత యువ సంచలనం తన్వి శర్మ మాత్రం విజయంతో శుభారంభం చేసింది. చైనాకు చెందిన యువాన్ ఆన్ కీపై 21-16, 21-15తో గెలిచి రెండో రౌండ్‌కు చేరింది. తదుపరి మ్యాచ్‌లో మరో భారత క్రీడాకారిణి శ్రీయాంశి వాలిశెట్టితో తలపడనుంది.

మహిళల సింగిల్స్‌లో మాన్సీ సింగ్ కూడా దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ జూ యూన్‌పై మూడు గేమ్‌ల పోరులో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది.

పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 118వ ర్యాంక్‌లో ఉన్న పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ – కృష్ణ ప్రసాద్ గరగ జోడీ నాలుగో సీడ్ థాయ్‌లాండ్ జోడీని సంచలనంగా ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. అయితే మహిళల డబుల్స్‌లో ప్రియా కొంజెంగ్బం – శృతి మిశ్రా జోడీ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలైంది.