పసిడి కప్పల రహస్యం ఇదే..!

  • నెలల తరబడి నేల అడుగున..

మండవల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : వర్షాకాలం ప్రారంభం కాగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండిపోయిన చెరువులు, కుంటలు, గుంతలు నీటితో నిండిపోతాయి. ఆ నీరు చేరిన కొద్ది రోజుల్లోనే పసుపు లేదా బంగారు రంగులో కనిపించే భారీ కప్పలు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో దర్శనమిస్తాయి.

కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కడా కనిపించని ఈ కప్పలు ఎలా వస్తాయి? అనే సందేహానికి శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన సమాధానం చెబుతున్నారు. ఈ పసుపు రంగు కప్పలను ఇండియన్ బుల్‌ఫ్రాగ్ (Hoplobatrachus tigerinus) అని పిలుస్తారు. ఇవి ప్రధానంగా వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయి.

వేసవిలో చెరువులు ఎండిపోయిన తర్వాత ఇవి చనిపోవు. నేలలో తేమ ఉన్న ప్రాంతాల్లో చిన్న గుంతలు తవ్వుకుని లోపలికి వెళ్లి నిద్రావస్థ (Aestivation)లో నెలల తరబడి గడుపుతాయి. ఈ సమయంలో వాటి శరీర జీవక్రియలు చాలా నెమ్మదిగా సాగుతాయి. ఆహారం, నీరు లేకున్నా శరీరంలో నిల్వ ఉన్న శక్తితో జీవిస్తాయి.

వర్షాలు ప్రారంభమై నేల తడిగా మారగానే, ఉష్ణోగ్రత తగ్గి తేమ పెరగడంతో అవి నేల అడుగు నుంచి బయటకు వస్తాయి. చెరువులు, కుంటలు నీటితో నిండిన వెంటనే అక్కడికి చేరుకుని సంభోగం చేసి గుడ్లు పెడతాయి. అందుకే వర్షాకాలంలో ఒక్కసారిగా వందల సంఖ్యలో ఈ పసిడి కప్పలు కనిపిస్తాయి. ప్రకృతి సృష్టిలో ఈ అద్భుత జీవచక్రం వర్షాకాలానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.