Vijaya-Dairy-Elections : ఒకే ఒక్కడు..! Andhra Prabha Top Story
Vijaya-Dairy-Elections : ఒకే ఒక్కడు..! Andhra Prabha Top Story
- త్యాగజీవి ఎవరు
- విజయ డెయిరీ ఎన్నికల్లో సూపర్ ట్విస్ట్
- మూడు పోస్టులు.. ..
- 3 నామినేషన్ల తిరస్కరణ
- బరిలో నలుగురు .
- ఒకరు వైదొలిగితే ఏకగ్రీవం..
- లేకుంటే ఈనెల 13న పోలింగ్
- డెయిరీ ఆవరణలో పోలీసు బందోబస్తు
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ )
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) పాలకవర్గంలో ఖాళీ కానున్న మూడు డైరెక్టర్ పదవుల భర్తీకి నిర్వహిస్తున్న ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలన అనంతరం ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో పోటీలో నలుగురు మాత్రమే మిగిలారు. నేడు (గురువారం) సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమవుతుందా.. లేక పోలింగ్‌కు దారితీస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 373 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల అధ్యక్షులు ఓటర్లుగా ఉండటంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Vijaya-Dairy-Elections :నామినేషన్ దాఖలు ..

విజయ డెయిరీ ఆవరణలోని క్షీరదర్శన్ హాలులో ఎన్నికల అధికారి, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (విరమణ) ఎల్. గురునాథం ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ప్రస్తుత చైర్మన్ చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, మూల్పూరు రామ్మోహన్, గొంది నరేంద్ర, మర్రెడ్డి బసివిరెడ్డి, పాలడుగు వసంతకుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం మూల్పూరు రామ్మోహన్, మర్రెడ్డి బసివిరెడ్డి, పాలడుగు వసంతకుమార్ నామినేషన్లను ఎన్నికల అధికారి తిరస్కరించారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాల సంఘాలు లేదా సంబంధిత సభ్యులకు విజయ డెయిరీకి బకాయిలు ఉండటంతో నిబంధనల ప్రకారం వారి నామినేషన్లు చెల్లవని ప్రకటించారు. దీంతో చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, గొంది నరేంద్ర మాత్రమే బరిలో నిలిచారు.
Vijaya-Dairy-Elections : నేడు ఉపసంహరణ..
విజయ డైరీలో డైరెక్టర్ల ఎంపిక కోసం జరుగుతున్న ఎన్నిక ప్రక్రియలో గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. పోటీలో ఉన్న నలుగురిలో ఒకరు ఉపసంహరించుకుంటే మూడు డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా భర్తీ కానున్నాయి. లేనిపక్షంలో అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించి ఈ నెల 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల్లో జిల్లాలోని 373 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల అధ్యక్షులు తమ ఓటు హక్కును వినియోగించి ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు.
Vijaya-Dairy-Elections : ఏకగ్రీవం వైపు
ప్రస్తుతం చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. నాలుగో అభ్యర్థి గొంది నరేంద్రను నామినేషన్ ఉపసంహరించుకునేలా చర్చలు జరుగుతున్నట్లు డెయిరీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో నేటి ఉపసంహరణ ప్రక్రియపై అందరి దృష్టి నెలకొంది.
Vijaya-Dairy-Elections : పటిష్ట బందోబస్తు…
విజయ డైరీలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొత్తపేట సీఐ చినకొండలరావు పర్యవేక్షణలో 30 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న అభ్యర్థులు, ప్రతిపాదకులు, మద్దతుదారులను మాత్రమే డెయిరీ ఆవరణలోకి అనుమతించారు. ఇటీవల విజయ డెయిరీపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నప్పటికీ, నిబంధనల మేరకు ప్రవేశాన్ని పరిమితం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయ డెయిరీ పాలకవర్గంలో ఈ మూడు స్థానాల భర్తీపై జిల్లాలోని పాల ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార రంగం దృష్టి కేంద్రీకరించాయి. నేటి నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నిక ఏకగ్రీవమా.. లేక 13న పోటీ అనివార్యమా అన్నది తేలనుంది.
