తెలంగాణకే జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ప్రజాగాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని వివరించిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించారని తెలిపారు.

శ్రీకాంత్ చారి వంటి అమరుల బలిదానాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని, మరో 7 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలు, ఏటీసీలు, న్యాక్ సెంటర్ల ద్వారా మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.2,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పురోగతిలో ఉన్నాయని, ఆగస్టు 2028 నాటికి పూర్తి చేసి దేవరకొండ నుంచి బ్రాహ్మణవెల్లెంల వరకు సాగునీరు అందించి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు.

ఎస్‌ఎల్‌బీసీతో పాటు పాలమూరు–రంగారెడ్డి సహా పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ సస్యశ్యామలం అయినప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు సాకారమవుతాయని మంత్రి అన్నారు.

గద్దర్ వర్ధంతిని పురస్కరించుకుని మాట్లాడుతూ, తన పాటల ద్వారా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామగ్రామాన చాటిన మహనీయుడు గద్దర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.