చిత్తడి చిత్తడిగా మారిన అట్లప్రగడ రోడ్డు

  • పట్టించుకోని అధికారులు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ: తిరువూరు- విజయవాడ జాతీయ రహదారిలోని ఎ.కొండూరు నుండి అట్ల ప్రగడ గ్రామానికి వెళ్లే రహదారి చిత్తడి చిత్తడిగా మారటంతో ప్రయాణికులు, ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఎన్నో సంవత్సరాల క్రితం ఆర్ అండ్ బీ శాఖాధికారులు నిర్మించిన రోడ్డు భారీ వర్షాలకు కొట్టుకుపోయి గుంతల మయంగా మారింది.

వర్షం కురిసిన ప్రతిసారి బురదమయంగా మారడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన నీటిపారుదల వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిల్వ ఉండి బురద మయంగా మారుతుంది. దీంతో ఈ మార్గంలో కాలినడకన ప్రయాణించడం కష్టసాధ్యంగా మారింది. అట్ల ప్రగడ గ్రామం నుండి వేరే గ్రామాలకు వెళ్లాలంటే వేరే మార్గం లేకపోవడంతో ఈ రహదారి గుండానే వెళ్లాల్సి వస్తుంది.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు పడే పాట్లు వర్ణనాతీతం. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగడుగునా బురద పేరుకు పోవడంతో కాలుజారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహన చోదకులు కూడా జారిపడే ప్రమాదం ఉండటంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమస్య ప్రతి ఏడాది పునరావృత్తం అవుతున్నప్పటికీ సంబంధిత శాఖాధికారులకు చీమ కూడా కుట్టినట్లు లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రహదారిలో చప్తాకు ఇరువైపులా రైలింగ్ నిర్మించకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది.

భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువ అయినప్పుడు ఈ వంతెన పైనుండి వాగు పొంగిపొర్లుతుందని, వాహన చోదకులు, ప్రయాణికులు రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు బీటీ రోడ్డు పై పడ్డగోతులను పూడిపించి, వంతెనకు ఇరువైపుల రైలింగ్ నిర్మించి,ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని అట్ల ప్రగడ గ్రామస్తులు ఆర్ అండ్ బీ అధికారులను ముక్తకంఠంతో కోరుతున్నారు.