సిద్దిపేటలో జయశంకర్ విగ్రహానికి హరీష్‌రావు ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను స్మరించిన ఎమ్మెల్యే..
జలహక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచన

సిద్దిపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఉద్యమానికి దిక్సూచి అయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్‌రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయశంకర్ సేవలను స్మరించుకుంటూ ఆయన తెలంగాణ సమాజానికి అందించిన స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ అనేది కేవలం భౌగోళిక ప్రాంతం కాదని, అది స్వాభిమానం, స్వయం నిర్ణయం, సామాజిక న్యాయం అనే భావజాలమని దేశానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.

జయశంకర్‌కు సిద్దిపేటతో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసిన హరీష్‌రావు, సిద్దిపేట అమరవీరుల స్తూపానికి ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని విశ్వసించి, ఉద్యమంలో ఆయనకు జయశంకర్ వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు.

జయశంకర్ వ్యక్తి కాదని, ఒక శక్తి అని అభివర్ణించిన హరీష్‌రావు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి దీర్ఘకాల పోరాట ఫలితమని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడామని పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్రంలో జలవనరుల అంశంపై కూడా హరీష్‌రావు స్పందించారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గోదావరి జలాల వినియోగం, జీఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టుల అనుమతులు, బనకచర్ల ప్రాజెక్టు, సమ్మక్కసాగర్‌కు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ ప్రజల హక్కులు, జలవనరులు, అభివృద్ధి ప్రాజెక్టులను పరిరక్షించడమే జయశంకర్ సార్‌కు నిజమైన నివాళి అవుతుందని హరీష్‌రావు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేర్చడం ప్రతి తెలంగాణవాసి బాధ్యత అని అన్నారు.