పెద్ద పులి పంజా.. మూగజీవులు బలి..
బండి ఆత్మకూరు, ఆంధ్రప్రభ : పెద్ద పులి దాడితో బండి ఆత్మకూరు మండలంలో భయాందోళనలు నెలకొన్నాయి. మండల పరిధిలోని సింగవరం చెరువు పరిసర ప్రాంతంలో రెండు ఆవులను చంపిన ఘటన స్థానికులను కలవరపరిచింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జాగ్రత్తలు వెల్లడించారు.
బండి ఆత్మకూరు మండలం సింగవరం చెరువు వద్ద రెండు ఆవులు మృతి చెందిన ఘటనపై ఫారెస్ట్ రేంజ్ అధికారి నాసిర్ ఝా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన ఆవులకు వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ జ్యోత్స్నా దేవి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి నాసిర్ ఝా మాట్లాడుతూ.. ప్రజలు అడవి అంచులు, చెరువు పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. పశువులను అడవికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మేతకు వదిలేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పెద్ద పులి ఆనవాళ్లు లేదా అడవి జంతువులు కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉంటూ అటవీ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
