అమరుల త్యాగాలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్‌నే

అమరుల త్యాగాలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్‌నే

  • మంత్రి లక్ష్మణ్ కుమార్

మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల ప్రాణత్యాగాలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అమరుల త్యాగాలకు సముచిత గౌరవం కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను ప్రజాపాలన ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలు చిట్యాల శ్వేతలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్‌తో కలిసి శంకరమ్మ, శ్వేతలకు పూలమాలలు, శాలువలు, మెమొంటోలు అందజేసి సత్కరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కృషి చేసిన అందెశ్రీ, గద్దర్ కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున అందించి అమరుల కుటుంబాలను గౌరవించిందన్నారు. అమరుల త్యాగాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. 2018 నుంచి 2023 వరకు కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగిందని, అందుకే ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కేసీఆర్ పాలనలో పేదల ఇళ్లను విస్మరించి, ప్రగతి భవన్, ఫామ్‌హౌస్ నిర్మాణాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని పేర్కొన్నారు.

నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని మంత్రి అన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఈ ప్రాంత సమస్యలపై స్పందించి, ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

అమరుల త్యాగాలను కేసీఆర్ విస్మరించారు: ఎమ్మెల్యే సామెల్

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ, కేసీఆర్ పదేళ్ల పాలనలో అమరుల త్యాగాలను విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కేవలం ఓట్ల కోసం వాడుకున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీలో నిలిపి శంకరమ్మకు ఖాళీ సీటే ఇచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఆత్మగౌరవం లభిస్తోందన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఎమ్మెల్యే సామెల్ తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇసుక దందాలు, అవినీతి, అక్రమాలే కొనసాగాయని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను గద్దె దించారని, రాబోయే ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కడం కల్ల అని ఎమ్మెల్యే సామెల్ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న, మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల, సింగిల్ విండో చైర్మన్ పి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామచంద్రు, సత్యనారాయణ, ఇటికాల చిరంజీవి, సుంకరి జనార్ధన్, నరేశ్, జోజి, బి. విద్యాసాగర్ పాల్గొన్నారు. కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీవిద్య, గనగాని శైలజ, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సత్యం, సుధాకర్ రెడ్డి, గుడిపాటి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply