ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన
మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచన
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం పిప్రి (జె) గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం గ్రామ ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ప్రజాప్రతినిధులు ఆహారం నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు పోషకాహారం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
విద్యార్థులకు ఉదయం రాగి జావ, మధ్యాహ్నం జీరా రైస్, వెజిటేబుల్ బిర్యానీ, చారుతో కూడిన భోజనం అందించినట్లు తెలిపారు.
గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పతాని రంజిత్ అలియాస్ జేమ్స్, వీడీసీ సభ్యులు పల్లె శ్రీనివాస్, స్వామి, రాజు, గంగారం, గ్రామ కార్యదర్శి జితేందర్, కారోబార్ ముత్తన్న తదితరులు పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
