దుర్గగుడి ఉద్యోగులకు ఘన వీడ్కోలు

దుర్గగుడి ఉద్యోగులకు ఘన వీడ్కోలు
పదవీ విరమణ పొందిన ముగ్గురికి సన్మానం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన వేదపండితులు వి.ఎస్. మహర్షి, ఉప ప్రధాన అర్చకులు పి. శ్రీనివాసశర్మ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. కోటేశ్వరరావులకు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు.
దేవస్థానం మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన పదవీ విరమణ సభలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
సభలో మాట్లాడిన చైర్మన్, ఈవో మరియు ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థాన అభివృద్ధికి, ఆధ్యాత్మిక సేవల విస్తరణకు, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో వారు చేసిన కృషిని ప్రశంసించారు. తమ విధుల్లో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి దేవస్థానానికి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, తమ సేవా కాలంలో సహకరించిన దేవస్థానం అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదవీ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
