పేద కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం

  • ఆళ్లగడ్డలో 46 మందికి రూ.45.74 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
  • అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం
  • చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయక నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక చేయూత అందించారు. ఈ పథకం కింద 46 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.45,74,226 విలువైన చెక్కులను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన బాధిత కుటుంబాలకు రూ.45.74 లక్షల విలువైన (సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని, అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.