గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై ఇంకా నిర్ణయం లేదు
- కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్
కుప్పం, ఆంధ్రప్రభ : కుప్పం శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిపై సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లు, టెలివిజన్ మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో వికాస్ మర్మత్ మాట్లాడుతూ, సోమవారం సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి అధికారులతో సాధారణ సమీక్ష సమావేశం మాత్రమే నిర్వహించామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ నమూనాలు, ప్రతిపాదనలపై చర్చ జరిగినప్పటికీ ఎలాంటి తీర్మానం చేయలేదని, పునర్నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో సుమారు ఏడాదిన్నర క్రితమే ఆలయ అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ప్రతి ఏడాది జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో మరుగుదొడ్లు, మౌలిక వసతులు, పరిసరాల అభివృద్ధి వంటి పనులకు రూ.8 నుంచి రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముఖ్యమంత్రి సహకారంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే ఆలయ కమిటీతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పనులు ముందుకు సాగలేదని వివరించారు.
సోమవారం జరిగిన సమావేశం పూర్తిగా చర్చల కోసమేనని, మీడియాకు ప్రకటించే స్థాయిలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు, భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆలయానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా అధికారికంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని, ఎలాంటి అంశాన్నీ రహస్యంగా ఉంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ప్రజల అభిప్రాయాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న ఆయన, కుప్పంలో పరిశ్రమల ఏర్పాటు, రహదారుల విస్తరణ, భూసేకరణ వంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అదే విధానంలోనే ప్రస్తుతం కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పడి సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు.
రీచ్-2, రీచ్-3 రహదారులు, బస్టాండ్, పార్కులు, పెరిమీటర్ వాల్, చెరువుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, హైమాస్ట్ లైట్లు, డీపీఓఎన్, హార్టికల్చర్, పీ-4, సంజీవని, కేర్ అండ్ గ్రో తదితర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతోనే విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. శ్రీ గంగమ్మ ఆలయం కుప్పం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని, ప్రతి సంవత్సరం సుమారు ఐదు లక్షల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
ఆలయ అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు కడా కార్యాలయంలో లిఖితపూర్వకంగా వినతులు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇది అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కాదని, ప్రజల అభిప్రాయాల సేకరణ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే అన్ని సూచనలను పరిశీలించిన అనంతరం మాత్రమే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధి లేదా పునర్నిర్మాణంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వికాస్ మర్మత్ మరోసారి స్పష్టం చేశారు.
