Vaishno Devi Yatra | ఆధ్యాత్మిక అనుభూతులతో సాగిన మరచిపోలేని పుణ్యయాత్ర..

Vaishno Devi Yatra | ఆధ్యాత్మిక అనుభూతులతో సాగిన మరచిపోలేని పుణ్యయాత్ర..
Vaishno Devi Yatra | స్వర్ణ దేవాలయంలో ప్రశాంత అనుభూతి
జలియన్ వాలాబాగ్ వద్ద కన్నీరు పెట్టించే చరిత్ర
వాఘా బోర్డర్‌లో దేశభక్తి ఉప్పొంగిన క్షణాలు
వైష్ణోదేవి దర్శనంతో నిండిన ఆధ్యాత్మిక ఆనందం
హిమాచల్ శక్తిపీఠాల పవిత్ర దర్శనం
మనాలి, సిమ్లా ప్రయాణంలో ప్రకృతి అందాలు
యాత్ర నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు
వరంగల్‌లో అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి జలంధర్ చేరుకున్నాము.
Vaishno Devi Yatra | అక్కడి నుండి యాత్ర నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఏసీ బస్సులో అమృత్‌సర్ చేరుకున్నాము (7వ తేదీ రాత్రి 7 గంటలకు బయలుదేరి, 9వ తేదీ తెల్లవారుజామున చేరాము). తర్వాత వారు ఏర్పాటు చేసిన చక్కటి వసతి గృహంలో అందరమూ ఫ్రెషప్ అయి, పంజాబ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్ (స్వర్ణ దేవాలయం)కు వెళ్లాము.
ఇది సిక్కు మతస్థులకు అత్యంత ఆధ్యాత్మికపరమైన పుణ్యక్షేత్రం. సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన పవిత్రమైన స్థలమిది.
ఈ గురుద్వారాను తెల్లటి పాలరాతి కట్టడంతో నిర్మించారు. దీని గోపురం మొత్తం బంగారు పూతతో మెరిసిపోతూ ఉంటుంది. అందుకే ఈ మందిరాన్ని స్వర్ణ దేవాలయము లేదా గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు.

శని, ఆదివారాలు అక్కడి స్థానికులకు ప్రత్యేక దినాలు. మేము శనివారం రోజు వెళ్లడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఆ స్వామి దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది.
దేవాలయంలో భక్తులు ఎంతో భక్తివిశ్వాసాలతో చేస్తున్న ప్రార్థనలు చూస్తుంటే చాలా సంతోషం వేసింది.
ఆలయంలోకి ప్రవేశం చేసే మునుపే ప్రతి ఒక్కరు మగ వాళ్లు తలపాక ధరించాలి(కావాలంటే గేటు దగ్గర తలపాకలు అక్కడి వాళ్లు ఇస్తారు.)
ఆడవాళ్లు తప్పనిసరి సరిగా తలమీద చున్నీ కానీ ,పైట కానీ కప్పు కోవాలి .అది వారి సాంప్రదాయం.

చారిత్రాత్మకమైన, అద్భుతమైన ఆ స్వర్ణ దేవాలయంలో అడుగుపెట్టగానే మనస్సుకు ఎంతో ప్రశాంతమైన అనుభూతి కలిగింది. ఈ దేవాలయం చుట్టూ అందమైన సరోవరం (అమృత సరోవరం) అలరారుతోంది.
అక్కడి నుండి దానికి సమీపంలోనే ఉన్న జలియన్ వాలాబాగ్కు వెళ్లాము.
జలియన్ వాలాబాగ్ దురంతం గురించి మనమందరం చరిత్ర (హిస్టరీ) పుస్తకాల్లో చదువుకునే ఉన్నాము. మన స్వాతంత్ర్య సమరయోధులు కొందరు అక్కడ శాంతియుతంగా సమావేశమైన సమయంలో… బ్రిటిష్ వారు అమానుషంగా కాల్పులు జరిపారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటంతో, ఆ బాగ్‌కు ఉన్న ఒకే ఒక్క చిన్న దారి గుండా బయటపడాలని చూశారు. కానీ ఆ తొక్కిసలాటలోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతో మంది బ్రిటిష్ బుల్లెట్లకు బలయ్యారు. అక్కడ ఉన్న గోడలు దూకలేక, దాదాపు రెండు వందల మంది పైగా అక్కడే ఉన్న బావిలోకి దూకి సజీవ సమాధి అయ్యారని చెప్పారు.
అలాంటి బాధాకరమైన దుర్ఘటన జరిగిన ఆ చోటును చూసినప్పుడు మన మనసు భారంతో నిండిపోయి, కళ్లు చెమ్మగిల్లుతాయి. ఆ త్యాగమూర్తులకు తలవంచి జోహార్లు సమర్పించడం ప్రతి భారతీయుడి కనీస విధి.

ఆ తర్వాత మేము “వాఘా బోర్డర్” దగ్గరకు వెళ్లాము.
ఇది భారత్-పాకిస్తాన్ సరిహద్దు. ప్రతి భారతీయ పౌరుడూ గర్వించదగిన ప్రదేశమిది.
అక్కడ మన సైనికులు చేసే పరేడ్, విన్యాసాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు, కన్నుల పండువగా ఉంటుంది. సాధారణంగా మనమంతా నా పిల్లలు, నా కుటుంబం అనే స్వార్థంతో తాపత్రయపడుతుంటాము. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా, తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకే అంకితమై, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధ్యతలు నిర్వహిస్తున్న మన సైనికులను చూస్తే మనసు ద్రవించిపోతుంది. నా కళ్లు చెమ్మగిల్లాయి. భరతమాత బిడ్డలైన ఆ వీర జవానులకు శతకోటి జోహార్లు! మన దేశ సైనికులకు, పాకిస్తాన్ సైనికులకు మధ్య ఒక గేటు ఉంటుంది. ఇరు దేశాల మధ్య సఖ్యతను సూచించేలా ఆ వాతావరణం ఉంటుంది. మన సైనికులు “వందేమాతరం”, “భారత్ మాతా కీ జై” అంటూ బిగ్గరగా నినదిస్తూ విన్యాసాలు చేస్తుంటే, ఆ తర్వాత పాకిస్తాన్ సైనికులు కూడా వారి విన్యాసాలు ప్రదర్శిస్తారు.
అమృత్‌సర్ నుండి జమ్మూ కాశ్మీర్‌లోని జమ్మూ చేరుకున్నాము. జమ్మూలోని అతి పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన వైష్ణోదేవిని సందర్శించుకున్నాము. ఆలయం చేరుకోగానే నా మనసు ఆనంద డోలికల్లో ఊగింది. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే తప్ప ఆ అమ్మవారి దర్శనం కలగదు అనడం అతిశయోక్తి కాదు. నిజానికి గత సంవత్సరమే మేము వైష్ణోదేవి యాత్రకు సిద్ధమయ్యాము, కానీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆ ప్రయాణం ఆగిపోయింది. ఈ ఏడాదికి ఆ తల్లి పిలుపు వచ్చింది.

జమ్మూ కాట్రాలో రాత్రికి సేదతీరాము. వైష్ణోమాత దర్శనానికి వెళ్ళడానికి, రావడానికి ముందే హెలికాప్టర్ బుక్ చేసుకున్నాము. ఉదయం 9:30 గంటలకు హెలికాప్టర్ ప్రయాణం కావడంతో, అందరమూ ఉదయం 7 గంటలకే యాత్ర రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి, అక్కడ ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) యాత్రా కార్డులను తీసుకున్నాము. తర్వాత 8 గంటలకు బయలుదేరి హెలీప్యాడ్ చేరుకున్నాము. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత, 10:30 గంటలకు హెలికాప్టర్ ఎక్కి, కేవలం 10 నిమిషాల్లో కొండపై ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకున్నాము. అక్కడి నుండి అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి ఇంకా నాలుగు కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల మేము ‘డోలి’ మాట్లాడుకుని వెళ్లాము. కొందరు బ్యాటరీ కార్లలో, కొందరు నడిచి, మరికొందరు గుర్రాలపై ప్రయాణించి అమ్మవారి దర్శనానికి బయలుదేరారు.
ఇక్కడ వైష్ణోదేవి అమ్మవారు ఎలాంటి విగ్రహ రూపంలో కాకుండా… మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలుగా ‘పిండీలు’ అనే మూడు స్వయంభూ మూర్తులుగా మనకు దర్శనమిస్తుంది. వైష్ణోదేవిని భక్తులు ఎంతో ప్రేమతో ‘మాతారాణి’ అని కూడా పిలుస్తారు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి శరీరం 108 భాగాలుగా ఖండించబడగా, అందులో 51వ భాగములో ఒకటైన అమ్మవారి కుడిచేయి ఇక్కడే పడిందని పురాణాలు చెబుతాయి (ఇది ఒక పవిత్ర శక్తిపీఠం). భైరవుడనే రాక్షసుని దుశ్చర్యలను తుదముట్టించేందుకు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణియై వాడిని సంహరించింది.

సంహరింపబడిన భైరవుడు చనిపోయే ముందు అమ్మవారి దివ్య శక్తిని తెలుసుకొని క్షమాపణ వేడుకున్నాడు. “తల్లీ! మీ దర్శనార్థం వచ్చే భక్తులు మిమ్మల్ని దర్శించుకున్నాక, నన్ను కూడా దర్శించుకునేలా అనుగ్రహించు” అని వేడుకున్నాడు. అమ్మవారు శాంతించి, “నా దర్శనం చేసుకున్న భక్తులు, ఆపై నిన్ను కూడా దర్శించుకుంటేనే వారి యాత్ర సఫలమవుతుంది” అని భైరవునికి వరమిచ్చింది. అందుకే భక్తులందరూ వైష్ణోదేవి దర్శనం తర్వాత తప్పకుండా ‘భైరవ బాబా’ దర్శనం చేసుకుంటారు. మేము కూడా అలాగే భైరవ బాబా దర్శనం చేసుకున్నాము.

మాతో పాటు వచ్చిన యాత్రికులలో కొందరు సాయంత్రం వేళ వెళ్లినవాళ్లు, అలాగే హెలికాప్టర్ మిస్ అయినవాళ్లు… ఆలయం నుండి దర్శనం ముగించుకొని తిరిగి వచ్చేసరికి రాత్రి ఒంటి గంట దాటింది. కానీ ఆ అర్ధరాత్రి సమయంలో కూడా భక్తులు గుడికి వస్తూనే ఉన్నారట. రాత్రి వేళ ఆ కొండ మొత్తం మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో కన్నుల పండుగగా వెలిగిపోయింది. మహా శక్తివంతమైన, కోరిన కోర్కెలను తీర్చే చల్లని తల్లి వైష్ణవి మాతను సందర్శించుకొని అందరమూ క్షేమంగా బసకు చేరుకున్నాము. భక్తులు ఎంతో ఉత్సాహంతో “జై మాతా దీ” అంటూ నినదిస్తూ ఆ కొండను సులువుగా ఎక్కేస్తుంటారు.

కాట్రా నుండి హిమాచల్ ప్రదేశ్‌కు మా ప్రయాణం సాగింది. దారిపొడవునా ఎత్తైన హిమాచల్ కొండలు, ఒకవైపు లోతైన లోయలు… వాటి మధ్యలో మా బస్సు ప్రయాణం ఎంతో రోమాంచితంగా సాగింది. అంత ఎత్తైన కొండల పైన ఇళ్లను, గృహ నిర్మాణాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మార్గమధ్యంలో కొండలను తొలిచి నిర్మించిన పొడవైన టనల్స్ (సురంగాలు), ఘాట్ రోడ్లు ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలుగా అనిపించాయి.
అక్కడి నుండి మేము చాముండ అనే ఊరు చేరుకున్నాము. మరుసటి రోజు కాంగ్రా జిల్లాలోని “వజ్రేశ్వరి మాత” దర్శనం చేసుకున్నాము. వనవాస సమయంలో పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం చెబుతోంది.
51 వశక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠంలో సతీదేవి ఎడమ వక్షస్థలము పడిన చోటు.
మాత వజ్రేశ్వరిదేవి శిలా రూపంలో పూజలు అందుకుంటున్నారు.
ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు ఉన్నాయి
లక్ష్మి సరస్వతి నవదుర్గస్వరూపాలు.
కపాల భైరవ స్వామిని, శివాలయము దర్శించుకున్నాము.
ప్రధాన ఆలయం ముందు ఇత్తడితో చేసిన సింహాలు పులులు కనిపిస్తాయి.
ప్రతి శక్తి పీఠాల ఆలయాలలో హోమాలు జరుగుతూ ఉంటాయి.
అలాగే కొందరు భక్తులు అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారు.
ఆ తర్వాత ‘బగళాముఖి దేవి’ దర్శనం చేసుకున్నాము. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అంతా పసుపు రంగు శోభతో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసన్నంగా కనిపిస్తుంది.
శత్రువులు మనమీద కుట్రతో హాని చేయాలనుకున్నప్పుడు
బగళాలాముఖి వాడి నోరు మెదపకుండా చేస్తుంది, చేయి లేవదు అడుగు పడదు, ఆ విధంగా శత్రువుల శక్తి అని ఇచ్చి వేస్తుంది. శక్తిమాత భగలాముఖి అమ్మవారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఉన్నవారు ఈ అమ్మవారిని దర్శించి పూజలు చేస్తూ ఉంటారట. మేము కూడా పసుపు రంగు వస్త్రంలో ధరించి అమ్మవారి దర్శనం చేసుకున్నాము.

కొంగ ముఖము కల దేవతగా చెబుతారు.
ముఖము కోలగా ఉంటుంది. అత్యంత ప్రకాశవంతంగా ఉన్న అమ్మవారి దర్శనము
చేసుకోనడం వలన మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది.అక్కడి నుండి మేము చింతాపూర్ణి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. మన చింతలన్నింటినీ బాపే కరుణామయి, శక్తి స్వరూపిణి ఆ తల్లి. 51 శక్తి పీఠాలలో ఒకటైన ఈ క్షేత్రంలో సతీదేవి శరీర భాగమైన “పాదము” పడిందని చెప్తారు. పండో, ఫలమో అమ్మవారికి సమర్పించుకొని.. మన చింతలు బాపమని, కోరికలు తీర్చమని వేడుకుంటే వరాలనిచ్చే కల్పవల్లి మన చింతాపూర్ణి అమ్మవారు.
ఈ క్షేత్రాన్ని ‘చిన్నమస్తా ధామ్’ అని కూడా అంటారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు తల లేకుండా దర్శనమిస్తారు. “యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా” అంటూ ఆ అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన మనకు అపారమైన శక్తి సామర్థ్యాలు చేకూరి, మనోధైర్యం కలుగుతుంది.
అక్కడ మాకు కమ్మటి గోధుమ హల్వా ప్రసాదం ఇచ్చారు. అయితే, వాళ్లు ఇచ్చే ప్రసాదాలను అక్కడే తినాలని, వెంట తెచ్చుకోకూడదని చెప్పారు. అది అక్కడి భక్తుల నమ్మకం. “మీరు బస్సులోకి ప్రసాదాలు తేవద్దు, ఒకవేళ తెస్తే బస్సు ఒక ఇంచ్ కూడా కదలదు” అని డ్రైవర్ చెప్పాడు. అమ్మవారి విషయంలో వారి నమ్మకాన్ని గౌరవించే బాధ్యత మనకు ఉంది కదా, అందుకే అందరమూ వాళ్లు చెప్పినట్టే చేశాము.

51 శక్తి పీఠాలలో, ఐదు శక్తి పీఠాలు హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉన్నాయి. చుట్టూ ఎత్తైన హిమాలయ పర్వతాలు, అక్కడక్కడా ఎత్తైన ఆకుపచ్చని దేవదారు వృక్షాలు, కొండల నుండి జాలువారే జలధారలు.. ఆ భగవంతుడు సృష్టించిన అందమైన ప్రకృతి దృశ్యాలు మన కనులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అమ్మవారి ఆలయాలన్నీ దాదాపు ఎత్తయిన కొండల మీద ఉండడం వలన మాకు రోడ్డు ట్రెకింగ్ చేసిన అనుభూతి కలిగింది. వందల మెట్లు ఎక్కి అమ్మవార్లను, అలాగే అక్కడ వెలసిన శివయ్యను దర్శించుకున్నాము.
చింతాపూర్ణి అమ్మవారి దర్శనం తర్వాత… చాముండా అమ్మవారి దర్శనానికి వెళ్లాము. ‘చాముండా నందికేశ్వర ధామ్’ లోని చాముండా అమ్మవారు దుర్గాదేవి అవతారాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి “చెవి భాగము” పడిందని చెబుతారు. రాత్రి తొమ్మిది గంటలకు జరిగే శయనింపు సేవ, అమ్మవారి నిజరూప దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగింది. అంతటి శక్తివంతమైన అమ్మవార్లను దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా అనిపించింది. అక్కడ అమ్మవార్లు పిండి రూపంలో (పిండీ రూపం) దర్శనమిస్తారు. అక్కడే ఒక కొండ గుహలో ఉన్న శివయ్యను కూడా దర్శించుకున్నాము.
అక్కడి నుండి జ్వాలాముఖీ ఆలయానికి చేరుకున్నాము. ఇది కూడా 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి “నాలుక” పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో దర్శనమిస్తారు. ఆ జ్వాలలు చూస్తుంటే అమ్మవారు నాలుక చాపి కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. వందల సంవత్సరాల నుండి ఆ జ్వాల ఎలాంటి ఇంధనం లేకుండా అలా వెలుగుతూ ఉండటం ఒక పరమాద్భుతం! అమ్మవారి ప్రకాశవంతమైన ఆ జ్యోతి స్వరూపాన్ని చూడగానే, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు హరించిపోయి, మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయనే భావన మనసులో కలుగుతుంది.
అక్కడ నుండి రాత్రి 8 గంటల సమయానికి మనాలి చేరుకున్నాము. బస్సు దిగగానే 14° చలి ఉండడం వల్ల అందరమూ కొంచెం వణికాము. యాత్రా నిర్వాహకులు ఏర్పాటు చేసిన రూమ్ షాపింగ్ ఏరియాకు దగ్గరగా ఉండడం వల్ల, మేము కొంతమందిమి వెళ్ళి స్వెటర్లు, ఊలు దుస్తులు కొనుక్కున్నాము.

మరుసటి రోజు ఉదయం హిడింబా ఆలయానికి వెళ్లాము. అక్కడ ఘటోత్కచుడి నివాసానికి గుర్తుగా ఒక పెద్ద చెట్టు కింద ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొందరు హిడింబా దేవి సాంప్రదాయ దుస్తులు ధరించి (ఫ్యాన్సీ డ్రెస్సులు) ఫోటోలు దిగారు.
అక్కడి నుండి మంచు ప్రదేశానికి (స్నో పాయింట్) వెళ్లాము. మా జతలో వచ్చిన కొంతమంది మంచు దుస్తులు ధరించి, స్కేటింగ్ చేస్తూ, మంచుతో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి తిరిగి వస్తూ ఒక హోటల్లో వేడివేడి ఆనియన్ పరోటాలు, చిల్లీ మోమోస్ తిన్నాము. అవి చాలా రుచికరంగా ఉన్నాయి.

ఆ తర్వాత సిమ్లాలో కాళికాదేవి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సిమ్లా అనగానే అందరూ “ఆపిల్స్ తిన్నారా?” అని అడుగుతారు కదా! కానీ మేము వెళ్లిన సమయంలో అది ఆపిల్ పంట సీజన్ కాదని చెప్పారు. సిమ్లాలో పగలు కొంచెం వేడిగా ఉన్నప్పటికీ రాత్రి మాత్రం చాలా చల్లగా ఉంది.
అక్కడి నుండి నైనాదేవి టెంపుల్‌కి వెళ్లాము. ఇక్కడ సతీదేవి నయనాలు (కళ్ళు) పడ్డాయని చెబుతారు. ఎత్తైన పర్వతాల మీద వెలసిన ఇలాంటి అమ్మవారి ఆలయాలు ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.
అమ్మవారి మూర్తి చిన్నదిగా ఉన్నప్పటికీ, ముఖభాగంలో విశాలమైన నేత్రాలతో నైనాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. ఆలయానికి కొంత దూరం వాహనంలో వెళ్లి, ఆపై మెట్ల మార్గం ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకున్నాము. ఇక్కడికి వెళ్ళడానికి రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. దుర్గాదేవియే ఇక్కడ నైనా దేవిగా పూజలందుకుంటోంది. శక్తి స్వరూపిణి అయిన ఆ చల్లని తల్లి మనపై చల్లని చూపులు కురిపించి, మనసుకు ఊరట కలిగించే శాంతి స్వరూపిణి. అంతేకాదు, భక్తుల రుణ బాధలను తీర్చే శక్తి స్వరూపిణి కూడా!

ఆ రోజు రాత్రికి చండీగఢ్ చేరుకున్నాము. చండీగఢ్ నుండి మధురై ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి (వరంగల్ మీదుగా వెళ్లే రైలు) సురక్షితంగా వరంగల్‌కు చేరుకున్నాము.
భగవంతుని దయ వల్ల మన వైష్ణోదేవి యాత్ర సంపూర్ణమైంది.
యాత్ర పొడవునా దైవనామ స్మరణలతో, కాసేపు అంత్యాక్షరి పాటల సందడితో ప్రయాణం చాలా సరదాగా సాగింది. జీవితంలో మరచిపోలేని మధురానుభూతులను మూటగట్టుకున్నాము.
యాత్ర అంతటా ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు ఉండడం, కొన్ని చోట్ల రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రయాణం చాలా నిదానంగా సాగింది. అయినప్పటికీ డ్రైవర్ సాబ్ చాలా జాగ్రత్తగా మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చారు.

మనందరికీ ఇలాంటి పుణ్యప్రదమైన, ఆహ్లాదకరమైన యాత్రను చేయించి, వంటవాళ్లతో చక్కటి భోజన సదుపాయాలు, మంచి వసతి గృహాలు ఏర్పాటు చేసిన మన యాత్రా నిర్వాహకులు యోగానంద గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి నా ధన్యవాదాలు, అభినందనలు మరియు ఆశీస్సులు
గడియారం ప్రసన్న లక్ష్మి
CLICK HERE TO READ Tirumala Darshan | సర్వదర్శనానికి 18 గంటలు
