చంద్రబాబు జోక్యంతో తాగునీటి సమస్యకు చెక్

  • గోదావరి నీరు విడుదల
  • 4 జేసీబీలు, 50మందితో యుద్ధ ప్రాతిపదికన పనులు
  • కో-ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు

ఆంధ్రప్రభ, ఏలూరు బ్యూరో: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణ జోక్యంతో ఏలూరు నగర ప్రజలకు రెండు పూటలా తాగునీటి సరఫరా చేయగలమన్న నమ్మకం కలిగిందని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. గోదావరి కాలువలో నీటిమట్టం తగ్గి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీరు అడుగంటడంతో తలెత్తిన తాగునీటి సమస్యపై శుక్రవారం ఆయన మున్సిపల్ ఎస్ ఈ బి .వెంకటరామిరెడ్డి, ఎం ఈ సురేంద్రబాబు లతో కలిసి దెందులూరు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడం, జులై 5 లోపు ఏలూరు కాలువకు రావాల్సిన గోదావరి జలాలు సమయానికి రాకపోవడంతో సమస్య వచ్చిందన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నెల రోజులకు సరిపడా ఉండాల్సిన నీరు పూర్తిగా తగ్గిపోయింది. ఇసుక పొరలు కనిపిస్తున్నాయి. నగర ప్రజలకు రెండు రోజులకు మాత్రమే నీరు ఉంది” అని వివరించారు.ఇరిగేషన్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా నీరు విడుదల చేయలేదని తెలిపారు.

సమస్య తీవ్రతను గుర్తించిన మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు వెంటనే ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఫిర్యాదు చేశారన్నారు.తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి జోక్యంతో ఇరిగేషన్ అధికారులు ఏలూరు కాలువకు గోదావరి నీటిని విడుదల చేశారు” అని పెదబాబు తెలిపారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు..

ఏలూరు కాలువ ఎండింగ్ పాయింట్ దెందులూరు కావడంతో పై నుంచి వచ్చిన గుర్రపు డెక్క, తుడు, నాచు మోటార్లను అడ్డుకుంటున్నాయని ఆయన చెప్పారు.ఈ సమస్యను అధిగమించేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే 4 జెసిబి లు, 50 మంది సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామని తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి మోటార్ల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోకి గోదావరి జలాలను పంపింగ్ చేయడం ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రస్తుతం కాలువలో నీటిమట్టం సంతృప్తిగా ఉండడంతో అన్ని మోటార్లు పనిచేస్తున్నాయని తెలిపారు.ఇదే విధంగా 10 రోజుల పాటు గోదావరి నీరు వస్తే నగర ప్రజలకు తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదు” అని పెదబాబు భరోసా ఇచ్చారు.

నగర ప్రజలకు విజ్ఞప్తి..

ఏలూరు నగరానికి తాగునీటిని అందించేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడుతున్నామని, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తాగునీటిని వృధా చేయకుండా అవసరానికి మాత్రమే వాడుకోవాలి” అని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో కో-ఆప్షన్ సభ్యుడు పెదబాబుతో పాటు మున్సిపల్ డి ఈ లు అప్పలరాజు, నారాయణ రావు, ఏఈ పవన్, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు పాల్గొన్నారు.