Vaibhav Sooryavanshi | ఫైనల్లో వైభవ్ సర్ప్రైజ్ ఎంట్రీ..

Vaibhav Sooryavanshi | ఫైనల్లో వైభవ్ సర్ప్రైజ్ ఎంట్రీ..
- అహ్మదాబాద్ చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ సంచలనం
అహ్మదాబాద్ : ఐపీఎల్ 2026 (IPL 2026) ఫైనల్‌కు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ (RR) అర్హత సాధించలేకపోయినప్పటికీ.. ఈ టీనేజ్ సెన్సేషన్ మే 31న నరేంద్ర మోదీ స్టేడియంలో సందడి చేయనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వైభవ్ సూర్యవంశీ అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ టోర్నీలో అతడు కనబరిచిన అద్భుత ప్రదర్శనకు గానూ బీసీసీఐ అతడిని ఫైనల్ వేదికపై సన్మానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్లేఆఫ్స్‌లో వైభవ్ విధ్వంసం..
క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ, అంతకుముందు ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్‌లు క్రికెట్ ప్రపంచాన్ని మురిపించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. గుజరాత్ తో జరిగిన క్వాలిఫైయర్ 2లో కీలకమైన మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తూ 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 96 పరుగులు చేసి జట్టుకు 214 పరుగుల భారీ స్కోరునందించాడు. అయితే శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో గుజరాత్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది.
ఆరెంజ్ క్యాప్ రేస్ ఇలా.. !!
ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ (16 ఇన్నింగ్స్ లో 776 పరుగులు) ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉండటంతో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు అతడి రికార్డును అధిగమించే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 15 ఇన్నింగ్స్ లో 722 పరుగులు చేసి 55 పరుగులు దూరంలో ఉండగా.. సాయి సుదర్శన్ 16 ఇన్నింగ్స్ లో 710 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కు 67 పరుగులు దూరంలో ఉన్నాడు. మరి ఈ సీజన్ ‘ఆరెంజ్ క్యాప్’ ఎవరిని వరిస్తుందో చూడాలి.
గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ గనుక ఈ మ్యాచ్‌లో మరో 67 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ తర్వాత వరుసగా రెండు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
