వరి, పత్తి, ఆయిల్‌పామ్ సాగులో సమగ్ర యాజమాన్యమే అధిక దిగుబడికి మార్గం
- రైతులకు శాస్త్రవేత్తల కీలక సూచనలు.. చీడపీడల నివారణపై అవగాహన
దిలావర్పూర్, ఆంధ్రప్రభ: వరి, పత్తి, ఆయిల్‌పామ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మండలంలోని గుండంపల్లి గ్రామంలో బీఎస్సీ (వ్యవసాయం) నాలుగో సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రైతులకు పంటల సంరక్షణ, చీడపీడలు, వ్యాధుల నివారణపై విస్తృతంగా వివరించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్త, సమన్వయకర్త డా. కె. రాహుల్ విశ్వకర్మ మాట్లాడుతూ.. వరి పంటలో అగ్రోమిన్ మ్యాక్స్‌ను లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. ఒక కిలో యూరియాతో పాటు 2.5 గ్రాముల కార్బెండాజిమ్, మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలని, నారు మడిలో కార్బోఫ్యూరాన్ 3జీని ఎకరానికి ఒక కిలో చొప్పున వేయాలని తెలిపారు. ప్రతి చర్య మధ్య కనీసం రెండు రోజుల విరామం పాటించాలని సూచించారు.
పత్తి పంటలో జాసిడ్ పురుగు దాడి వల్ల ఆకుల అంచులు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారడం, ఆకులు కప్పు ఆకారంలో ముడుచుకోవడం వంటి లక్షణాలను రైతులు ముందుగానే గుర్తించాలని చెప్పారు. నివారణకు ఫిప్రోనిల్‌ను లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలని, ఎకరానికి ఎనిమిది నుంచి పది నీలం, పసుపు, తెలుపు రంగుల స్టిక్కీ ట్రాప్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కలు 45 రోజుల వయస్సు వచ్చిన తర్వాత చమత్కార్ మందును లీటరు నీటికి 1.2 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలని, రసంపీల్చే పురుగుల నివారణకు ఉలాలా మందును 1:20 నిష్పత్తిలో కలిపి కాండానికి బొట్టు పద్ధతిలో పూయాలని తెలిపారు.
ఆయిల్‌పామ్ పంటలో కొమ్ము పురుగు నివారణకు ఎకరానికి ఒక ట్రాప్ ఏర్పాటు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని వివరించారు.
కార్యక్రమంలో రైతులు ఎ. చినరెడ్డి, ఎం. రాజ్‌కుమార్ రెడ్డి, కె. బుచ్చారెడ్డి, వై. నరేష్ రెడ్డి, ఎ. సురేష్ రెడ్డి పాల్గొని శాస్త్రవేత్తలు తెలిపిన సూచనలపై పలు సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
