వ్యవసాయ విద్యలో కొత్త విప్లవం..

  • ఏఐ కోర్సులతో బాపట్ల అగ్రికల్చర్ కాలేజీకి నూతన దిశ
  • 81 ఏళ్ల ఘన చరిత్ర.. భవిష్యత్‌కు ఆధునిక ప్రణాళికలు
  • ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, కొత్త పరిశోధనా కేంద్రాల ఏర్పాటు

బాపట్ల, ఆంధ్రప్రభ: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బాపట్ల వ్యవసాయ కళాశాల 81వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ డా. పాలడుగు వెంకట సత్యనారాయణ కళాశాల చరిత్ర, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, వ్యవసాయ విద్యలో ప్రవేశపెట్టనున్న నూతన కోర్సులపై వివరించారు.

1945లో స్థాపించబడిన బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఇప్పటివరకు సుమారు 12 వేల మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారని, వారిలో 2,500 మంది పీజీ, 250 మందికి పైగా పీహెచ్‌డీ పూర్తి చేసి దేశ, విదేశాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నారని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన కరువు, ఆహార కొరత వంటి దుర్భిక్ష పరిస్థితులు పునరావృతం కాకుండా వ్యవసాయ విద్య, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో బాపట్ల వ్యవసాయ కళాశాల స్థాపించబడిందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యానికి ముందే ఎస్.వి. రామమూర్తి, డా. బి.వి. నాధ్, పి.వి. కృష్ణయ్య చౌదరి కృషితో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందన్నారు. 81వ ఫౌండేషన్ డే సందర్భంగా ఐసీఏఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సెరికల్చర్ యూనిట్, ప్లాంట్ పాథాలజీ విభాగంలోని ప్లాంట్ హెల్త్ క్లినిక్, పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన అగ్రి దీక్ష హాల్లను ప్రారంభించారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేక రీజినల్ కమిటీ ఏర్పాటు చేసి రోడ్లు, డ్రైనేజీ, నీటి పారుదల వ్యవస్థ, హాస్టళ్లు, ఆడిటోరియం వంటి మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

సీఎస్‌ఆర్ నిధులు, యూనివర్సిటీ ఫండింగ్, పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. అలాగే అగ్రి టూరిజంలో భాగంగా కళాశాల, వ్యవసాయ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 1954 నుంచి వెలువడుతున్న ఆంధ్ర అగ్రికల్చరల్ జర్నల్ ద్వారా ఇప్పటివరకు 6 వేలకుపైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. వ్యవసాయ జర్నలిజంలో విశేష సేవలందించిన వారికి ఆంధ్ర అగ్రికల్చరల్ జర్నల్ అవార్డు, వ్యవసాయాభివృద్ధికి విశేష కృషి చేసిన పూర్వ విద్యార్థులకు యూనివర్సిటీ ఆలుమ్ని అవార్డు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా మన నేల – మన భవిత పుస్తకాన్ని ఆవిష్కరించారు. వ్యవసాయ విద్యను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇప్పటికే ప్రారంభించిన పీజీ కోర్సును విస్తరించనున్నట్లు తెలిపారు. డిజిటల్ అగ్రికల్చర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త పీజీ కోర్సు, నాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్‌కు సంబంధించిన కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విద్యలో భాగం చేసి విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా యూనివర్సిటీ కట్టుబడి ఉందన్నారు.

కార్యక్రమానికి డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా. చెరుకూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, డా. వి. ప్రసన్నకుమారి అతిథులను ఆహ్వానించారు. అసోసియేట్ డీన్ డా. పి. ప్రసూనరాణి స్వాగతోపన్యాసం చేశారు. ఏఏజీటీసీడీ కన్వీనర్ డా. కె. జయలలిత పూర్వ విద్యార్థుల సేవలను వివరించగా, ఆంధ్ర అగ్రికల్చరల్ జర్నల్ ఎడిటర్ డా. టి. మధుమతి నివేదిక సమర్పించారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డా. డి. సంపత్ కుమార్ విద్యార్థులను ప్రోత్సహించారు.

ఉత్తమ పరిశోధనా పత్రాలు సమర్పించిన ఎం. శివాని, జ్యోత్స్న, వేణుగోపాలంకు వెండి పతకాలు ప్రదానం చేశారు. కళాశాలకు విశేష సేవలందించిన వలేటి గోపీచంద్, సాంబశివరావు, టి. శ్రీనివాస్‌లను ఘనంగా సత్కరించారు. చివరగా డా. పి. సుధా జాకబ్ వందన సమర్పణ చేశారు.