‘పై’ అండతో పెత్తనం..!
- ఆబ్కారీ పెద్దల పేర్లు చెప్పుకుంటూ సిండికేట్ సూత్రధారి హల్చల్
- ‘ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు
- బదిలీలు చేయిస్తానంటూ భయపెడుతున్నాడన్న ఆరోపణలు
- అధికారుల పేర్లతోనే మద్యం దందాకు రక్షణ కవచమా?
- సిండికేట్ ఆగడాలపై శాఖలోనే అసంతృప్తి చర్చ
- సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని స్థానికుల డిమాండ్
ఖమ్మం, ఆంధ్రప్రభ : కూసుమంచి ప్రాంతంలో మద్యం సిండికేట్ వ్యవహారంలో మరో కీలక కోణం వెలుగులోకి వస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైన్‌షాపుల్లో స్టాక్ కొరత సృష్టించి బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయాలు సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు సిండికేట్ సూత్రధారి వ్యవహారశైలిపైనా చర్చ జరుగుతోంది. తనకు ఆబ్కారీ శాఖలోని కొందరు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయుధంగా మార్చుకుని కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణల్లో వాస్తవమెంతన్నది అధికారిక విచారణలోనే తేలాల్సి ఉంది.
‘ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ…
సిండికేట్ కార్యకలాపాలపై ఎవరైనా ప్రశ్నించినా, తనకు “పైస్థాయిలో అండ ఉంది” అని బహిరంగంగానే చెబుతున్నాడని ప్రచారం వినిపిస్తోంది. “నాపై చర్యలు తీసుకునే అధికారి లేడు”, “నన్ను ఎవరూ తాకలేరు” వంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని పలువురు చెబుతున్నారు. ఈ మాటలతో కింది స్థాయి ఆబ్కారీ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయనే చర్చ సాగుతోంది. కొందరు అధికారులు కూడా అనవసర వివాదాలు వద్దనే ధోరణితో మౌనం పాటిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సిండికేట్ మరింత ధైర్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు అంటున్నారు.
బదిలీల పేరుతో ఒత్తిడి?
తన మాట వినని వారిపై బదిలీల బెదిరింపులు కూడా చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. “పై అధికారులతో మాట్లాడి పోస్టింగ్ మార్చిస్తా” అని హెచ్చరిస్తున్నాడని కొందరు పేర్కొంటున్నారు. విధి నిర్వహణలో అభ్యంతరాలు చెప్పిన సిబ్బందినే లక్ష్యంగా చేసుకుంటున్నాడనే విమర్శలు ఉన్నాయి. అధికారిక వ్యవస్థను తన వ్యక్తిగత ప్రభావానికి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితులతో నిజాయితీగా పనిచేసే సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిండికేట్ పట్టు మరింత బలపడిందా?
ఈ అండదండల ప్రచారంతోనే మద్యం వ్యాపారంపై సిండికేట్ పట్టు మరింత బలపడిందని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వైన్‌షాపుల్లో ఏ బ్రాండ్ ఉండాలి, ఏది ఉండకూడదు అన్న నిర్ణయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడని చెబుతున్నారు. బెల్ట్‌షాపులకు సరుకు మళ్లించే వ్యవహారంలో కూడా అదే నెట్వర్క్ పనిచేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు అధిక ధరలకు మద్యం కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికీ ఈ వ్యవస్థ వల్ల నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విచారణ జరిగితేనే వాస్తవాలు
ఆబ్కారీ శాఖలోని ఉన్నతాధికారుల పేర్లు ఉపయోగిస్తున్నాడన్న ప్రచారంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. నిజంగా అలాంటి సంబంధాలు ఉన్నాయా? లేక అధికారుల పేర్లను దుర్వినియోగం చేసి భయపెడుతున్నాడా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో నిరాధార ప్రచారం అయితే దానినీ బహిర్గతం చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు. పారదర్శక విచారణ ద్వారానే ఈ వివాదానికి తెరపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.
