ఖరీఫ్ రైతుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
ఖరీఫ్ రైతుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
- రైతులకు సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు, సాగునీరు
- ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ రంగానికి పూర్తి మద్దతు
- మే 15 నుంచే దశలవారీగా సాగునీటి విడుదల
- రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం , ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు . రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖరీఫ్–2026 సీజన్‌కు అవసరమైన 93 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను గత సంవత్సరాల మాదిరిగానే 50 శాతం రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. మిగిలిన అవసరాల కోసం టీజీఎస్ డీసీ, హెచ్ఐఎల్, ఎన్ఎస్ సీ, ఆంగ్రూ సంస్థల ద్వారా అదనపు విత్తనాల సేకరణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు .
ఈ ఏడాది 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వేరుశనగ విత్తనాల సేకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మే 20 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే 1.62 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను మే 15 నుంచి రాయితీపై రైతులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. చిరుధాన్యాలు, అపరాలు తదితర ఇతర విత్తనాలను జూన్ 15 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,03,901 క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరిగిందని, 2026-27 సంవత్సరానికి 1,20,678 క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
గత ప్రభుత్వం 2019-20 నుంచి 2023-24 వరకు రాయితీ విత్తనాలు సరఫరా చేసిన సంస్థలకు 476.94 కోట్ల రూపాయిల బకాయిలు ఉంచిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి చెల్లింపులు ఇప్పటికే విడుదల చేసిందని, 2025-26 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. రైతులకు వివిధ పంటలపై ఆకర్షణీయమైన రాయితీలు కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు . వరి విత్తనాలకు జిల్లాల వారీగా క్వింటాల్‌కు 500 నుంచి 1000 రూపాయిల వరకు రాయితీ, చిరుధాన్యాలకు 50 శాతం, పప్పుధాన్యాలకు 30 శాతం, శనగలకు 25 శాతం, వేరుశనగ, నువ్వులకు 40 శాతం, పచ్చిరొట్ట ఎరువు విత్తనాలకు 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు 90 శాతం వరకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో 80 శాతం వరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్‌కు ఎరువుల కొరత లేదు..
రాష్ట్రంలో ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ఖరీఫ్ 2026 సీజన్‌కు మొత్తం 18.09 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయింపు ఉండగా, మే నెల వరకు ఇప్పటికే 3.44 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు . ఏప్రిల్ 1 నాటికి 7.13 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉండగా, ఇప్పటివరకు మరో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రానికి చేరాయని తెలిపారు. దీంతో మొత్తం 8.84 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు . ఇప్పటివరకు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు విక్రయించగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. యూరియా 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 0.35 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3.62 లక్షల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 0.46 లక్షల మెట్రిక్ టన్నుల మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేసి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎరువుల సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు . జిల్లాల వారీగా నిల్వలు, సరఫరాపై అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధీకృత ఎరువుల దుకాణాల నుంచే ఎరువులను కొనుగోలు చేయాలని, అధిక ధరలకు కొనవద్దని మంత్రి సూచించారు. రైతులకు అవసరమైన ప్రతి ఎరువు సమయానికి అందేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు.
సాగుకు సమగ్ర నీటి ప్రణాళిక సిద్ధం
ఖరీఫ్–2026 సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖతో సమన్వయం చేస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు . రాష్ట్రంలోని భారీ , మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, జలాశయాల్లో నిల్వలు, కాలువల మరమ్మతులు, ఖరీఫ్ అవసరాలను సమీక్షించిన అనంతరం మే 15 నుంచి దశలవారీగా సాగునీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి తెలిపారు . ఖరీఫ్ పంటల సాగు సాధారణంగా జూన్ నుంచి ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగుతుందని, వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ తదితర పంటలకు సమృద్ధిగా వర్షపాతం, సాగునీరు అవసరమవుతాయని తెలిపారు. ప్రతి జిల్లాలో నీటి లభ్యత ఆధారంగా ఇరిగేషన్ బోర్డు సమావేశాల్లో నీటి విడుదల తేదీలను ఖరారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గోదావరి డెల్టా వ్యవస్థ పరిధిలో ప్రస్తుతం 51.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. జూన్ 30 వరకు ఖరీఫ్ అవసరాలకు 38.52 టీఎంసీలు అవసరమవుతాయని, మిగిలిన 13.15 టీఎంసీలతో జూలై 14 వరకు సాగునీటి అవసరాలు తీర్చగలమని చెప్పారు. కాలువల మరమ్మతులు, సిల్టు తొలగింపు, కలుపు నివారణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువల అభివృద్ధి పనులు చేపట్టినందున మే చివరి వరకు పనులు పూర్తి చేసి జూన్ 1 నుంచి నీటి విడుదల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కృష్ణా డెల్టా వ్యవస్థలో పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 24.43 టీఎంసీల ప్రత్యక్ష నిల్వ ఉందని తెలిపారు. జూన్ నెల ప్రారంభ ఖరీఫ్ అవసరాలకు 18.22 టీఎంసీలు అవసరమవుతాయని చెప్పారు.
తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు కేటాయించిన తర్వాత 2.21 టీఎంసీలు మిగులుతున్నాయని మంత్రి తెలిపారు . శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం అదనపు నీటి లభ్యత లేదని చెప్పారు. కాలువల నిర్వహణ పనులు మే 2 నుంచి ప్రారంభమయ్యాయని, జూన్ 1 నుంచి కృష్ణా తూర్పు డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం 9.22 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. సాగు పనులు జూన్ రెండో వారంలో ప్రారంభమవుతాయని, వరి నాట్లు జూలై రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశముందన్నారు . ప్రస్తుతం కాలువల నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు . ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కడప జిల్లాలోని ఐదు మధ్య తరహా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 3.905 టీఎంసీల నిల్వ ఉందని తెలిపారు. కాలువల వ్యవస్థ సక్రమంగా సిద్ధంగా ఉండడంతో మే 15 నుంచే నీటి విడుదలకు అవకాశం ఉందన్నారు. అనంతపురం జిల్లాలో గత పదేళ్లలో జూలైలోనే నీటి విడుదల ప్రారంభమైన దృష్ట్యా ఈ ఏడాది కూడా జూలై 17 ప్రాంతంలో నీటి విడుదల జరిగే అవకాశముందని తెలిపారు. తుంగభద్ర హై లెవల్ కాలువ పరిధిలో కూడా ప్రస్తుతం నీటి నిల్వలు పరిమితంగా ఉన్నాయని, గత అనుభవాల ప్రకారం జూలైలోనే నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం మొత్తం 27.07 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 17.866 టీఎంసీలుగా ఉందని మంత్రి తెలిపారు. తాగునీరు, ప్రారంభ సాగు అవసరాల కోసం మే 15 నుంచి జూన్ 15 వరకు రోజుకు 7,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తన ప్రకటనలో తెలిపారు .
గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు..
2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా, 887.90 టీఎంసీల నీటి వినియోగం జరిగినట్లు మంత్రి తెలిపారు. అలాగే 2024-25 ఖరీఫ్‌లో 96.22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్, వంశధార, తాడిపూడి, ఎస్‌ఆర్‌బీసీ, తుంగభద్ర తదితర ప్రధాన ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులకు ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, సాగునీటి లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఎటువంటి నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు పూర్తి మద్దతు అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
