ఆసియా కప్ కాంస్య విజేత గీతశ్రీ..
ఆసియా కప్ కాంస్య విజేత గీతశ్రీ..
ఘన సత్కారం చేసిన శాప్ చైర్మన్ రవి నాయుడు
అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలి
శాప్ చైర్మన్ రవి నాయుడు
విజయవాడ, ఆంధ్రప్రభ : జపాన్‌లో ఇటీవల జరిగిన మహిళల అండర్-18 హాకీ ఆసియా కప్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి నమ్మి గీతశ్రీను శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందించారు. గురువారం విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో గీతశ్రీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గీతశ్రీని శాలువాతో సత్కరించిన రవి నాయుడు, అంతర్జాతీయ వేదికపై భారత జట్టులో స్థానం సంపాదించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడం ప్రతి ఆంధ్రప్రదేశ్ వాసికి గర్వకారణమని అన్నారు.
చిన్న వయసులోనే క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయమని కొనియాడారు. మహిళల హాకీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి గీతశ్రీలాంటి యువ క్రీడాకారిణులు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి మరిన్ని పతకాలు అందించాలని ఆకాంక్షించారు.
క్రీడాకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, శాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని రవి నాయుడు తెలిపారు. శాప్ తరఫున గీతశ్రీకి అందాల్సిన ప్రోత్సాహకాలు, నగదు బహుమతులను త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తున్న యువ క్రీడాకారిణులను ప్రోత్సహించడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గీతశ్రీ సాధించిన విజయాన్ని పలువురు క్రీడా అధికారులు అభినందించారు.
