వంట గ్యాస్ కొరత లేదు.. ఆందోళన అనవసరం…

వంట గ్యాస్ కొరత లేదు.. ఆందోళన అనవసరం…
ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ప్రత్యేక అధికారిని నియమించాం
డిమాండ్, సరఫరాపై నిరంతర పటిష్ట పర్యవేక్షణ
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా జరుగుతోంది
ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. జేసీ ఇలక్కియ మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లాలో గ్యాస్ సరఫరా స్థితిగతులపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో మూడు చమురు సంస్థలకు సంబంధించి 8,63,778 ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయని.. అదేవిధంగా 18 హెచ్‌పీసీఎల్, 12 బీపీసీఎల్, 26 ఐవోసీఎల్ కు సంబంధించి మొత్తం 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నట్లు తెలిపారు.
ఈ నెల 30న 15,186 బుకింగ్స్ జరగ్గా.. ఆ రోజు 19,440 సిలిండర్ల డెలివరీ జరిగిందని వివరించారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డిమాండ్, సరఫరా పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా పెండింగ్ ఎక్కువగా ఉంటే అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు సప్లయ్ మేనేజర్లు ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అదేవిధంగా గృహ అవసరాలకే కాకుండా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా సోమవారం నుంచి సజావుగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అవసరముంటేనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ ఏజెన్సీకి వెళ్లనవసరం లేదని.. డెలివరీ సిబ్బంది ఓటీపీ ఆధారంగా గ్యాస్ సిలిండర్‌ను ఇంటివద్దే అందిస్తారని జేసీ పేర్కొన్నారు.
90 శాతం ఓటీపీ ద్వారానే..
బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టేందుకు వీలుగా జిల్లాలో దాదాపు 90 శాతం ఓటీపీ ఆధారంగానే సిలిండర్ల డెలివరీ జరుగుతోందని.. ఈ విషయంలో వెనుకబడ్డ కంచికచర్లలోని భాస్కర్ గ్యాస్ ఏజెన్సీకి షోకాజు నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) అందుబాటులో ఉందని.. ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఈ నంబరుకు కాల్ చేసి తెలియజేయవచ్చని సూచించారు.
ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వినియోగం వైపు మళ్లాలని కోరారు. తక్కువ ఖర్చుతో అధిక భద్రతతో నిరంతర గ్యాస్ సరఫరాకు పీఎన్‌జీ కనెక్షన్లు వీలుకల్పిస్తాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 వేలు మాత్రమే పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ వివరించారు. సమావేశంలో డీఎస్‌వో పల్నాటి వాణి, ఏఎస్‌వో వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
