దేశ చరిత్రలో చెరగని సంతకం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్…

దేశ చరిత్రలో చెరగని సంతకం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్…

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఇబ్రహీంపట్నంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : స్వతంత్ర భారత చరిత్రలో చెరగని సంతకం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం భీమరాజు గట్టు వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యే వసంత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సామాన్య కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ చిన్ననాటి నుంచే పాఠశాలలో కుల వివక్ష ఎదుర్కొంటూ అత్యంత చురుకైన విద్యార్థిగా ఎదుగుతూ… ముంబయి ఎల్ఫిన్ స్టన్ కాలేజీలో చదివి, అమెరికన్ కొలంబియా విశ్వవిద్యాలయం, యూకే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో రెండు డాక్టరేట్లు పొందిన తొలి భారతీయుడిగా కీర్తి గడించారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా అందించిన విశిష్ట సేవలతో పాటు జూరిస్టుగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, ముంబయి లా కళాశాల ప్రిన్సిపాల్ గా, ప్రొఫెసర్ గా డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ చేసిన కృషి అనన్యసామాన్యం, అభినందనీయమన్నారు.

స్వతంత్ర భారత తొలి కేబినెట్ లో న్యాయ శాఖమంత్రిగా తన ముద్రను పరిచయం చేసిన అంబేద్కర్ సామాజిక సేవకుడిగా కుల వివక్ష, అంటరానితనం, దళిత అణగారిన వర్గాల మహిళలకు విద్య ద్వారా సాధికారత సాధన, సామాజిక సమానత్వ సాధన, మానవ హక్కుల పరిరక్షణ లాంటి పలు ఉద్యమాలను ముందుండి నడిపారని చెప్పారు. 29 ఆగస్టు 1947న భారత రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా నియమింపబడిన అంబేద్కర్ రాజ్యాంగ రచన పూర్తి చేసి 26 నవంబర్ 1949న నాటి రాజ్యాంగ అసెంబ్లీ అంగీకారం తెలపడం, అది 26 జనవరి 1950 నుంచి అమలులోకి రావడం మనందరికీ తెలుసిందేనన్నారు.

1990లో మరణానంతరం భారతరత్న పురస్కారం పొందిన అంబేద్కర్ మేథో సంపత్తి అపారమన్నారు. భీమ్ జయంతి శుభ గడియల్లో అంబేద్కర్ చేసిన సామాజిక విలక్షణ కృషికి ప్రతిరూపంగా సామాజిక సమన్యాయం, పౌర స్వేచ్ఛ పరిరక్షణ, సోదరభావం, మానవ హక్కుల సంరక్షణ లాంటి అంశాలను సుసాధ్యం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసి “బాబాసాహెబ్” అంటూ గౌరవంగా పిలువబడినట్లు గుర్తు చేశారు. సమానత్వ సాధనలో భాగంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేయడానికి “బహిష్కృత్ హితకరిని సభ” అనే కులరహిత సమాజ స్థాపన ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు.

కుల వ్యవస్థను ఎదిరిస్తూ మానవ హక్కుల స్థాపనకు ఎనలేని కృషి చేశారన్నారు. ప్రఖ్యాత లండన్ మ్యూజియంలో కార్ల్ మార్క్స్ విగ్రహ సమీపాన అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం ఆయన చేసిన అపార కృషికి నిదర్శనమన్నారు. కుల వివక్ష కోరలు చాచిన కాలంలో క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటూనే, చదువుపై ఏకాగ్రత పెట్టి ఆర్థికశాస్త్రంలో అత్యున్నత స్థాయి విద్యను అర్జించి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించిన అంబేద్కర్ జీవితం ప్రపంచ యువతకు నిత్యం దారి దీపంగా నిలుస్తుందని, ముఖ్యంగా యువతకు ప్రేరణను నింపుతుందని చెప్పారు. కార్యక్రమంలో స్దానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply