tvk | విజయ్‌కి ఐదేళ్ల పాలన కష్టమే
tvk | విజయ్‌కి ఐదేళ్ల పాలన కష్టమే
tvk |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల ఆ రాష్ర్టంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సంచలన విజయం సాధించింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. అయితే తమిళనాడు రాష్ర్టంలో ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కి సరిపోను మ్యాజిక్ ఫిగర్ లేదు. దీంతో ఇతర పార్టీల మద్దతు విజయ్‌కి అవసరమైంది.
ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2) పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, మెజారిటీకి సంఖ్యాబలం సరిపోలేదు. ఇంతలోనే డీఎంకే కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), వీసీకే పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేది లేదని ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
అయితే విజయ్ సీఎం కాకముందే చిన్న పార్టీలు గొంతెమ్మ కోర్కలు కోరుతూ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మద్దతు ఇవ్వాలంటే ఆ పదవి కావాలని, ఇది కావాలని చుక్కలు చూపిస్తున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే ఏకంగా డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేస్తోంది. ఇలా అధికారంలోకి వచ్చాక విజయ్‌ను ఇంకెంత ఇబ్బంది పెడతారో అనే చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఐదేళ్ల పాటు స్థిరమైన పాలన అందించడం ఆయనకు పెద్ద సవాలుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే (VCK) మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సీపీఐ, సీపీఎం మద్దతు బయట నుంచేనని, వారి విధేయత డీఎంకే (DMK) వైపే ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే కూటమిలో ఏ చిన్న మార్పు వచ్చినా ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, కీలక నిర్ణయాల్లో ఇతర పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అలాగే హామీల అమలులో విజయ్ చురుకైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. విజయ్ మొదటిసారి ముఖ్యమంత్రి అవుతుండటంతో , రాజకీయ అనుభవం లేకపోవడం ఇబ్బందులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.విజయ్ సర్కార్ నిలదొక్కుకోవడం ‘దినదినగండం’లా సాగుతుందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
