చివరి కోరిక వింటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి..!
- అమెరికా పౌరసత్వానికి గుడ్‌బై..
ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : విదేశాల్లో స్థిరపడి అమెరికా పౌరసత్వం పొందడం ఎంతోమందికి జీవిత లక్ష్యంగా భావిస్తారు. కానీ ఓ 94 ఏళ్ల వృద్ధురాలు తీసుకున్న నిర్ణయం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలనే కోరికతో భారత పౌరసత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ దరఖాస్తు చేశారు.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపాల గ్రామానికి చెందిన మహాలక్ష్మమ్మ… తన భర్త నాగభూషణం మరణించిన తర్వాత కుమారుడు, క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ కె.బుచ్చయ్య చౌదరి వద్ద ఉండేందుకు అమెరికాకు వెళ్లారు. 2000 జూలైలో అమెరికా పౌరసత్వం పొందిన ఆమె, దాదాపు రెండు దశాబ్దాల పాటు అక్కడే నివసించారు. అనంతరం 2018లో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఇక్కడే తన ఉంటున్నారు.
తన జీవితంలోని చివరి క్షణాల్ని.. శేష జీవితాన్ని భారతదేశంలోనే గడపాలని, భారతీయురాలిగానే మరణించాలని నిర్ణయించుకున్నట్టు మహాలక్ష్మమ్మ తెలిపారు. ఈ మేరకే స్వచ్ఛందంగా అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వ పునరుద్ధరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదా ఉంది.
కలెక్టర్ సాక్షిగా.. భావోద్వేగ ప్రమాణం..
గతంలో విజయలక్ష్మి పేరుతో వెలుగులోకి వచ్చిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. చేసిన విజ్ఞప్తికి బాపట్ల జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించింది. అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి, ఆమెకు భారత పౌరసత్వాన్ని పునరుద్ధరించారు. జూన్ 24న బాపట్ల కలెక్టరేట్ వేదికగా జరిగిన ఈ ఘట్టం అత్యంత భావోద్వేగంగా సాగింది. జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ సమక్షంలో భారత రాజ్యాంగంపై విధేయత ప్రమాణం చేస్తుంటే, ఆమె గొంతులో గర్వం, కళ్లలో దేశభక్తి స్పష్టంగా కనిపించాయి.
అందరి కళ్లూ చెమ్మగిల్లాయి..
అధికారిక పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న ఆ క్షణం.. ఆమెకు మరుపురానిది. దశాబ్దాల విదేశీ జీవితం తర్వాత తిరిగి తన స్వదేశపు గుర్తింపును పొందానన్న ఆనందం ఆమె కళ్లలో బాష్పాలుగా ఉబికివచ్చింది. నా కోరిక తీరింది.. ఇక నా మట్టిలో కలిసిపోయే భాగ్యం దక్కింది అని ఆమె గద్గద స్వరంతో పలికిన మాటలు అక్కడున్న అధికారులను సైతం భావోద్వేగానికి గురిచేశాయి.
ఈ సందర్భంగా… మహాలక్ష్మమ్మ తన మిగిలిన జీవితాన్ని తన స్వదేశంలో గడపాలని, చివరి సంస్కారాలు కూడా భారతదేశంలోనే జరగాలని కోరుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసిందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
అమెరికా నుండి చింతగుంపల వరకు..
భర్త మరణానంతరం 2000వ సంవత్సరంలో అమెరికా వెళ్లిన మహాలక్ష్మమ్మ సుమారు 18 ఏళ్ల పాటు అక్కడే నివసించారు. అగ్రరాజ్యపు విలాసాలు ఏవీ ఆమె మనసును మార్చలేకపోయాయి. పుట్టిన ఊరి మీద మమకారంతో 2018లో స్వదేశానికి తిరిగొచ్చారు. అప్పటి నుండి తన జన్మభూమి గుర్తింపు కోసం చేసిన నిరంతర ప్రయత్నం నేడు విజయవంతమైంది. ఇకపై తన సొంత గ్రామం చింతగుంపలలో ప్రశాంతంగా గడుపుతూ, తన చివరి క్షణాలను భారతీయురాలిగా గడపాలన్న ఆమె ఆకాంక్ష సాకారమైంది. తన పుట్టిన గడ్డ పట్ల ఉండాల్సిన అనుబంధానికి, దేశం పట్ల ఉండాల్సిన నిబద్ధతకు మహాలక్ష్మమ్మ ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు.
