Rain Alert | తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్!

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో మరోసారి వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.

అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉండటంతో నగర ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.