Breaking | కరాచీలో ఉగ్రదాడి..
- పాకిస్థాన్ రేంజర్స్ స్థావరంపై ఆత్మాహుతి దాడి
- 9 మంది మృతి, పలువురికి గాయాలు
- భద్రతా బలగాలు–ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు..
- బాధ్యత వహించినట్లు జమాత్-ఉల్-అహ్రార్ ప్రకటన
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్‌లోని కరాచీ నగరం శనివారం భారీ ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. గులిస్తాన్-ఇ-జౌహర్ ప్రాంతంలోని పాకిస్థాన్ రేంజర్స్ ప్రధాన స్థావరం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు అనంతరం ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ప్రతిదాడి చేపట్టాయి.
ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందినట్టు సమాచారం. మరో నలుగురికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మరణాల సంఖ్యను పాకిస్థాన్ ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. గాయపడిన భద్రతా సిబ్బందిని అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
దాడి అనంతరం మరో రెండు చిన్న పేలుళ్లు కూడా సంభవించినట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని భద్రతా బలగాలు పూర్తిగా చుట్టుముట్టి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పేలుడుకు గల కారణాలు, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్యపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ఈ దాడికి జమాత్-ఉల్-అహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రకటనను పాకిస్థాన్ అధికారులు ఇప్పటివరకు స్వతంత్రంగా ధృవీకరించలేదు.
