నేలపట్ల, కుంట్లగూడెంలో ఉచిత వైద్య శిబిరం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల, కుంట్లగూడెం గ్రామాలలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పేజ్ ఇండియా, హెచ్ఎస్బీసీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ సమాఖ్య లీడర్లు, వృద్ధుల సంఘాల సభ్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా హెల్పేజ్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ తురక షడ్రక్ మాట్లాడుతూ.. వృద్ధుల జీవనోపాధి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వృద్ధులు మోకాళ్ల నొప్పులు, రక్తపోటు (బీపీ) వంటి సమస్యల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హెల్పేజ్ ఇండియా స్టేట్ హెడ్ (ఏపీ, తెలంగాణ) యేతేంద్ర యాదవ్, మేనేజర్ మిర్నాల్ శ్రీకాంత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ పోచంపల్లి వి. వేణు, గ్రామ వాలంటీర్లు దొబ్బటి మహేశ్వరి, బండి సుజాతతో పాటు వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్లు, గ్రామ సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్పేజ్ ఇండియా సంస్థకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
