టెట్ పేపర్ లీక్… సిట్ దర్యాప్తునకు ఆదేశాలు..

  • పరీక్షను వాయిదా వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
  • నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఫడ్నవీస్ ఆదేశం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)-2026 పేప‌ర్ లీక్ వ్యవహారం కలకలం రేపుతుంది. జూన్ 28న జరగాల్సిన టెట్ పరీక్షకు ఒక రోజు ముందే ప్రశ్నాపత్రంలోని కొన్ని భాగాలు లీకైనట్లు ఆరోపణలు రావడంతో పరీక్షను వాయిదా వేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరపాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు.

ఠాణే జాయింట్ పోలీస్ కమిషనర్ పంజాబ్రావ్ ఉగాలే నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే, రాష్ట్ర డీజీపీ సదానంద్ దాతేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసులో ఠాణే జిల్లా భివాండిలో బిహార్, హర్యానాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద అసలు ప్రశ్నాపత్రం ప్రతులు లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) టెట్-2026 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా 1,728 పరీక్షా కేంద్రాల్లో 6 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. ప్రశ్నాపత్రం లీక్ వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు పలు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)తో పాటు మహారాష్ట్ర పోటీ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం-2024 కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై బెయిల్‌కు అవకాశం లేని కఠిన చర్యలు తీసుకునే వీలుందని అధికారులు వెల్లడించారు.

పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే పరీక్షను వాయిదా వేసినట్లు మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి స్పష్టం చేసింది. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం కొత్త పరీక్ష తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది.