Tirupati | 66 విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ..
హీరో సంస్థను అభినందించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ పి
Tirupati | తిరుపతి (రాయలసీమ బ్యూరో ) ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ హీరో మోటార్స్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద తిరుపతి జిల్లా కు చెందిన 66 మంది మహిళా పోలీసులకు విడా (VIDA) ఎలక్ట్రిక్ స్కూటర్లకు పంపిణీ చేసింది బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ , జిల్లా ఎస్ పి సుబ్బారాయుడు లాంఛనంగా వాహన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. . పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచన మేరకు సత్యవేడులో ఇటీవలే ప్రారంభమైన హీరో మోటోకార్ప్ సంస్థ 66 VIDA ఎలక్ట్రిక్ స్కూటర్లను తిరుపతి జిల్లా పోలీసు శాఖకు అందజేసారు..అంతకుముందు ప్రారంభంలో ఆ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు . మహిళా పోలీసు సిబ్బందికి హెల్మెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వైట్ టీ-షర్ట్‌లను కూడా అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ ప్రతిపాదన మేరకు మహిళా పోలీసు సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాలను అందించిన హీరో మోటోకార్ప్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా ఆధునిక, సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌కు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్ పి సుబ్బరాయుడు మాట్లాడుతూ…. హీరో సంస్థకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ ఈ వాహనాలలో 53 వాహనాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న 53 పోలీస్ స్టేషన్లకు ఒక్కోటి చొప్పున, మిగిలిన 13 వాహనాలను మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో మహిళా పోలీస్ స్టేషన్లు/మహిళా పోలీసు విభాగాలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

ఈ వాహనాలను ప్రధానంగా శక్తి టీమ్ (Women Safety Team) ద్వారా మహిళల భద్రత, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, శక్తి యాప్, డయల్-112 సేవలపై ప్రచారం, సైబర్ నేరాల నివారణ, మహిళల చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సకాలంలో చేరుకుని తక్షణ సహాయం అందించడం వంటి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్లు శ్రీనివాసులు (పరిపాలన), రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు), ఎం.శ్రీలత (మహిళా విభాగం), గీతా కుమారి (ఎస్బీ), జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, హీరో మోటోకార్ప్ ప్లాంట్ హెడ్ ప్రభు ఎస్, హెచ్ ఆర్ హెడ్ మనోహర చక్రవర్తి , సెక్యూరిటీ హెడ్, లెఫ్టినెంట్ కమాండర్ కె. కిరణ్, హీరో మోటార్స్ షో రూమ్ ప్రతినిధి పృద్వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
